NTV Telugu Site icon

PV Sindhu: క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్

Sindhu

Sindhu

ఇండోనేసియా బ్యాడ్మింటన్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.గురువారం హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ సింధు 23–21, 20–22, 21–11తో గ్రెగోరియా మరిస్క టుంజుంగ్‌ (ఇండోనేసియా)పై చెమటోడ్చి గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా సొంత ప్రేక్షకుల మధ్య సింధుకు తొలి రెండు గేమ్‌లలో గట్టి పోటీనిచ్చింది. తొలి గేమ్‌ ఆరంభంలో దూకుడుగానే ఆడిన భారత స్టార్‌ 10-5తో సులభంగా గేమ్‌ గెలిచేలా కనిపించింది. కానీ పుంజుకున్న గ్రెగొరియా.. సింధుకు గట్టిపోటీ ఇచ్చింది. ఆ తర్వాత గేమ్‌లోనూ సింధు ప్రతి పాయింట్‌కూ చెమటోడ్చక తప్పలేదు. ఒక దశలో ఆమె 5-10తో వెనకబడింది. కానీ పుంజుకున్న సింధు 15-15తో స్కోరు సమం చేసింది. ఆఖర్లో తడబడిన సింధు గేమ్‌ చేజార్చుకుంది. కానీ మూడో గేమ్‌లో సింధు.. గ్రెగొరియాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 7-0తో ఆధిక్యంలోకి వెళ్లడమే కాక ఆ తర్వాత అదే జోరుతోడి తేలిగ్గా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 71 నిమిషాల పాటు ఈ పోరు సాగడం విశేషం.

 

పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ లక్ష్య సేన్‌ 21–18, 21–15తో రాస్మస్‌ జెమ్కే (డెన్మార్క్‌)పై ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మాత్రం సుమీత్‌ రెడ్డి– అశ్విని పొన్నప్ప జోడి పరాజయంతో వెనుదిరిగింది. రెండో సీడ్‌ చైనా ద్వయం జెంగ్‌ సీ వీ– హువాంగ్‌ కియాంగ్‌ 21–18, 21–13తో భారత జంటను ఓడించారు.