Site icon NTV Telugu

Prithvi Shaw: బీసీసీఐకి కౌంటర్.. సాయిబాబా ఫోటో పోస్ట్ చేసిన పృథ్వీ షా

Prithwi Shaw

Prithwi Shaw

Prithvi Shaw: న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో వన్డే, టీ20 సిరీస్‌లకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో యువ ఓపెనర్ పృథ్వీ షాకు చోటు దక్కలేదు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పృథ్వీ షా విశేషంగా రాణించాడు. ఏడు మ్యాచుల్లో 47.50 సగటుతో 285 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతడి స్ట్రైక్ రేటు 191.28గా ఉంది. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నటిప్పటికీ పృథ్వీ షాకు టీమ్‌లో చోటు దక్కకపోవడంపై పలువురు క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు సెలక్టర్ల తీరుపై పృథ్వీ షా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాడు.

తాను అద్భుతంగా ఆడుతున్నా త‌న‌ను సెలెక్టర్లు ప‌క్కన‌పెట్టడం నిరాశ‌ను క‌లిగించింద‌ని గతంలోనే పృథ్వీ షా ఆరోపించాడు. టీ20 ప్రపంచకప్‌కు తనను ఎంపిక చేయకపోవడాన్ని నేరుగా తప్పుబట్టాడు. తాను కష్టపడుతున్నా అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాట్స్‌మెన్‌లకు పరుగులు చేయడమే ముఖ్యమని, ఆ విష‌యంలో తాను ప్రతీసారి నిరూపించుకుంటూనే ఉన్నాన‌ని.. అయినా త‌న‌ను ప‌క్కన‌పెడుతున్నార‌ని ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. తాజాగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్‌లకు ఎంపిక చేయకపోవడాన్ని కూడా పృథ్వీ షా మరోసారి సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించాడు.

Read Also: CPI Narayana US Tour: ఆ ఫోటోతో అమెరికాలో చేదు అనుభవం.. షాకైన నారాయణ

ఈ సందర్భంగా ‘నువ్వు అన్నీ చూస్తున్నావని ఆశిస్తున్నా’ అని సాయిబాబా ఫొటోను పృథ్వీ షా పోస్టు చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. పలువురు క్రికెట్ అభిమానులు షాకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. అటు న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు తనను ఎంపిక చేయకపోవడాన్ని ఉమేష్ యాదవ్ కూడా తప్పుబట్టాడు. ‘నువ్వు నన్ను ఫూల్ చేయొచ్చు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు జాగ్రత్త’ అని ఉమేష్ పోస్ట్ చేశాడు. మరోవైపు నితీష్ రాణా, రవి బిష్ణోయ్ కూడా సెలక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘HOPE’ అని రాణా, సెట్‌బ్యాక్ కంటే కమ్‌బ్యాక్ బలమైందని రవి బిష్ణోయ్ పోస్టులు చేశారు.

Exit mobile version