Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్‌కైవసం

Praggnanandhaa

Praggnanandhaa

భారత చెస్ సంచలనం, గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం (జూన్ 5, 2026) జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. టోర్నమెంట్ చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై అద్భుత విజయం సాధించిన ప్రజ్ఞానంద మొత్తం 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో నార్వే చెస్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

20 ఏళ్ల ప్రజ్ఞానంద టోర్నమెంట్ చివరి దశలో అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్‌ల్లో విజయం సాధించి తన సత్తా చాటాడు. టోర్నమెంట్ మధ్యలో కొన్ని పరాజయాలతో పాయింట్ల పట్టికలో వెనుకబడినప్పటికీ, చివరి రౌండ్లలో అద్భుత పునరాగమనం చేసి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

×
×
Ad

ఫైనల్ రౌండ్‌కు ముందు అమెరికాకు చెందిన వెస్లీ సో ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ప్రజ్ఞానంద విజయం సాధించగా, వెస్లీ సో తన క్లాసికల్ మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. దీంతో ప్రజ్ఞానంద ఒక పాయింట్ ఆధిక్యంతో ఛాంపియన్‌గా నిలిచాడు. అనంతరం జరిగిన ఆర్మాగెడాన్ గేమ్‌లో వెస్లీ సో, అలీరెజా ఫిరౌజ్జాను ఓడించి 17 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ప్రజ్ఞానంద స్పందన

టైటిల్ విజయం అనంతరం ప్రజ్ఞానంద మాట్లాడుతూ, “టోర్నమెంట్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయినా వాటి గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ప్రతి గేమ్‌ను కొత్తగా తీసుకుని కేవలం నా ఆటపై మాత్రమే దృష్టి పెట్టాను. చివరికి ఆ కృషికి ఫలితం దక్కడం ఆనందంగా ఉంది” అని తెలిపాడు. ఈ విజయంతో ప్రపంచ చెస్ వేదికపై భారత యువ గ్రాండ్‌మాస్టర్ మరోసారి తన ప్రతిభను చాటుతూ భారత చెస్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.