Site icon NTV Telugu

National Games 2022: నేటి నుంచే జాతీయ క్రీడలు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ

National Games

National Games

National Games 2022: భారత్‌లోని అన్ని ప్రాంతాల క్రీడాకారులు పోటీపడే సమయం ఆసన్నమైంది. దేశంలోని అత్యుత్తమ అథ్లెట్ల మధ్య క్రీడా సమరం నేటి నుంచి జరగనుంది. గుజరాత్‌లో గురువారం 36వ జాతీయ క్రీడలను నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అక్టోబర్‌ 10 వరకు జరిగే ఈ క్రీడల్లో భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అథ్లెట్లతో పాటు భారత త్రివిధ దళాలకు చెందిన సర్వీసెస్‌ జట్టు నుంచి మొత్తం ఏడువేల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. మొత్తం 36 ఈవెంట్స్‌లో పతకాల కోసం పోటీలుంటాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్‌ నగరాల్లో మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. సైక్లింగ్‌ ఈవెంట్‌ను మాత్రం న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. చివరిసారిగా 2015లో కేరళలో ఈ క్రీడలు జరిగాయి. ఆ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 33 పతకాలతో 12వ ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది.

Suryakumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్

అధికారికంగా ఈ క్రీడలు గురువారం ప్రారంభమవుతున్నప్పటికీ ఇప్పటికే కొన్ని క్రీడాంశాల్లో పోటీలు మొదలయ్యాయి. భారత టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ఈ నెల 30 నుంచి చైనాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉండటంతో… టీటీ పోటీలను ఈనెల 20 నుంచి 24 వరకు నిర్వహించారు. కబడ్డీ, లాన్‌ బౌల్స్, రగ్బీ క్రీడాంశాల్లోనూ పోటీలు మొదలయ్యాయి. ఏడేళ్ల తర్వాత మళ్లీ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. భారత సంప్రదాయ ఆటలు ఖోఖో, యోగాసన, మల్లఖంబ్‌ జాతీయ క్రీడల్లో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఆయా క్రీడాంశాల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు లేకుండానే నేటి నుంచి జాతీయ క్రీడలు అధికారికంగా మొదలుకానున్నాయి. ఒలింపిక్‌ పతక విజేతలు నీరజ్‌ చోప్రా, పీవీ సింధు, బజ్‌రంగ్‌ పునియా, ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ వేర్వేరు కారణాల వల్ల ఈ క్రీడలకు దూరమయ్యారు. కానీ ఆరంభోత్సవంలో నీరజ్‌, సింధు పాల్గొననున్నారు.

భారత్‌, పాక్‌ విడిపోకముందు 1924లో లాహోర్‌లో తొలిసారి జాతీయ క్రీడలను నిర్వహించారు. ఆ ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌కు అథ్లెట్లను ఎంపిక చేయడం కోసం ‘ఇండియన్‌ ఒలింపిక్‌ క్రీడలు’ పేరుతో వీటిని మొదలెట్టారు. రెండేళ్లకోసారి వీటిని నిర్వహించారు. 1940లో జాతీయ క్రీడలుగా పేరు మార్చారు.

Exit mobile version