PBKS Star Shashank Singh Assault Case: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరఫున ఆడుతున్న భారత క్రికెటర్ శశాంక్ సింగ్ సహా అతడి తండ్రి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్‌పై మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కేసు నమోదైంది. తమ ఇంట్లో పని చేస్తున్న వంట మనిషిపై దాడి చేసి.. దుర్భాషలాడినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రతీబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఘటన ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాధితుడు విపేంద్ర సింగ్ తోమర్ తన ఫిర్యాదులో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉచిత భోజనం, వసతి:
‘నేను ఇటీవల రేవా నుంచి తెలిసిన వ్యక్తి ద్వారా భోపాల్‌కు వచ్చాను. భారత క్రికెటర్ శశాంక్ సింగ్ ఇంట్లో పనికి చేరాను. నెలకు రూ.15 వేల జీతంతో పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు సహాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగంలో చేరిన కొద్ది గంటల్లోనే నాకు మానసిక వేధింపులు, దురుసు ప్రవర్తన ఎదురైంది’ అని విపేంద్ర సింగ్ తోమర్ తన ఫిర్యాదులో ఆరోపించాడు.
వంట మనిషిపై దాడి చేశారు:
‘నేను వండిన ఆహారం బాగా లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అది భరించలేక ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లిపోతా అని చెప్పాను. వెంటనే శశాంక్ సింగ్, ఆయన తండ్రి శైలేష్ సింగ్ ఆగ్రహానికి గురయ్యారు. నా మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కొని.. ఎవరితోనూ మాట్లాడకుండా అడ్డుకున్నారు. నన్ను బలవంతంగా పని చేసేలా ఒత్తిడి తెచ్చారు. భయంతో ఒక గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నా. శశాంక్ సింగ్, శైలేష్ సింగ్, వారి డ్రైవర్ తలుపు తెరిచి నాపై దాడి చేశారు’ అని ఫిర్యాదులో విపేంద్ర సింగ్ తోమర్ వివరించాడు.
ముఖం, శరీరంపై గాయాలు:
బాధితుడికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ముఖం, శరీరంపై గాయాల గుర్తులు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఫిర్యాదు, వైద్య నివేదికల ఆధారంగా రతీబాద్ పోలీసులు శశాంక్ సింగ్, శైలేష్ సింగ్ సహా వారి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 296(B) (అశ్లీల ప్రవర్తన, దుర్భాషలాడటం), సెక్షన్ 115(2) (ఉద్దేశపూర్వకంగా గాయపరచడం/దాడి), సెక్షన్ 3(5) (సామూహిక ఉద్దేశంతో నేరానికి పాల్పడటం) కింద ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

