Site icon NTV Telugu

Virat Kohli: ఇసుకపై కోహ్లీ బొమ్మ వేసి.. అభిమానం చాటిన పాక్ ఫ్యాన్

Pak Fan Kohli Art

Pak Fan Kohli Art

Pakistani Fan Of Virat Kohli Makes His Sand Portrait: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. దాయాది దేశమైన పాకిస్తాన్‌లోనూ అతనికి వీరాభిమానులున్నారు. కేవలం కోహ్లీ ఇన్నింగ్స్ చూసేందుకు, మైదానాలకు వచ్చిన వారు కోకొల్లలు. అయితే.. ఆ అవకాశం అందరికీ దక్కదుగా! అందుకే, కొందరు మరో మార్గంలో తమ అభిమానాన్ని చాటుతుంటారు. తమకున్న ప్రతిభను రంగరించి.. కోహ్లీ బొమ్మని గీస్తూ, అతనిపై తమకున్న అభిమానాన్ని చాటుతుంటారు. తాజాగా పాకిస్తాన్ అభిమాని కూడా సరిగ్గా అలాంటి పనే చేశాడు. అయితే, ఇతను అందరికంటే భిన్నంగా, ఇసుకపై కోహ్లీ బొమ్మ వేశాడు. ఆ అభిమాని పేరు ఆర్ఏ గద్దాని. పాకిస్తాన్ ప్రావిన్స్‌లోని బాలోచిస్తాన్‌కి చెందిన ఆ అభిమాని.. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు ఫిదా అయి.. అతని మీద ప్రేమతో ఇసుకపై కోహ్లీ ప్రతిమ వేశాడు. బీచ్‌కి దగ్గర్లో ఎంతో చక్కగా వేసిన ఆ బొమ్మ చూస్తే.. ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే! దీంతో, ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా.. పాకిస్తాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో, కోహ్లీ ఒంటిచేత్తో భారత్‌ని గెలిపించిన విషయం తెలిసిందే! వెనువెంటనే ఓపెనర్లను కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఉన్న భారత్‌ను.. హార్దిక్ పాండ్యా సహకారంతో ఆదుకొని, చివరివరకు క్రీజులో నిల్చొని, టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతుల్లో అతడు 82 పరుగులు చేశాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ మ్యాచ్‌లో 44 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఫామ్ కోల్పోయాడని ఇన్నాళ్లూ పెదవి విరిచిన విమర్శకులకు.. ఈ రెండు ఇన్నింగ్స్‌లతో కోహ్లీ గట్టి కౌంటరిచ్చాడు. మరోవైపు.. రేపు సౌతాఫ్రికాతో భారత్ ఈ మెగా టోర్నీలో తన మూడవ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. సెమీస్‌కి దాదాపు బెర్త్ కన్ఫమ్ చేసుకున్నట్టే!

Exit mobile version