Pakistan Former Cricketer Aqib Javed Comments On Hardik Pandya: భారత క్రికెట్ జట్టులో ఉన్న అత్యంత కీలకమైన ఆటగాళ్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఒకడు. ఇతడు తన బౌలింగ్ ప్రతిభతో ఎన్నో మ్యాచుల్ని తిప్పేశాడు. ఒంటిచేత్తో భారత్‌ని నడిపించిన సందర్భాలూ ఉన్నాయి. డెత్ ఓవర్స్‌లో పరుగుల్ని కట్టడి చేయడంలో బుమ్రా తనకు తానే సాటి. అలాంటి బౌలర్.. టీ20 వరల్డ్‌కప్‌కు దూరం అవ్వడంతో, క్రీడాభిమానుల్లో ఆందోళన నెలకొంది. బుమ్రా లేని భారత్ పేస్ ఎటాక్ ఎలా ఉంటుందోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాజాగా పాక్ మాజీ ఆటగాడు ఆకిబ్ జావెద్ స్పందించాడు. బుమ్రా లేని లోటు ఉన్నప్పటికీ.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటను మార్చగల సత్తా ఉన్న ఆటగాడు భారత జట్టులో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అతనెవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. హార్దిక్ పాండ్యా.
‘‘బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్ దళం ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే! షాహీన్ షా ఆఫ్రిది, రవూఫ్ లాంటి ఇంపాక్ట్ బౌలర్లు టీమిండియాలో లేరు. ఇంపాక్ట్ బౌలర్‌స్.. ప్రత్యర్థి బ్యాటర్లపై చాలా ఒత్తిడి తీసుకువస్తాడు. ప్రస్తుతం భారత జట్టులో మీడియం పేస్ బౌలర్లే ఉన్నారు. అయితే.. ఏ సమయంలోనైనా ఆటను మార్చగల శక్తి హార్దిక్ పాండ్యాకు ఉంది. తన ప్రతిభతో అతడు మ్యాచ్‌ని మలుపు తిప్పగలడు’’ అంటూ జావెద్ పేర్కొన్నాడు. అతడు చెప్పినట్లు పాండ్యా కొన్ని సందర్భాల్లో మ్యాచ్‌ని మలుపు తిప్పడమే కాదు, సింగిల్ హ్యాండెడ్‌గా గెలిపించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి, ఈ మెగా టోర్నీలోనూ సత్తా చాటుతాడని ఆశించొచ్చు. కాగా.. ఈ టీ20 టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఈ నెల 23న ఎదుర్కోబోతోంది. దీంతో.. ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
