Pakistan Fans Slams Umpires For Giving No Ball In IND vs PAK Match: చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో.. పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే! విరాట్ కోహ్లీ చివరివరకూ అద్భుత ఇన్నింగ్స్ ఆడటం, హార్దిక్ పాండ్యా అతనికి మద్దతు ఇవ్వడంతో.. ఈ విజయాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది. అయితే.. మహ్మద్ నవాజ్ వేసిన చివరి ఓవర్‌లో అంపైర్లు ఇచ్చిన ‘నో బాల్’ ప్రకటనపై మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. ఇది నో-బాల్ ఏమాత్రం కాదని, కోహ్లీ ఒత్తిడి చేయడం వల్లే అంపైర్లు నో-బాల్ ప్రకటించారంటూ పాక్ అభిమానులు మండిపడుతున్నారు. భారత్ మోసం చేసి ఈ మ్యాచ్ గెలిచిందని ఆరోపణలు చేస్తున్నారు.
పాక్ అభిమానులకు వత్తాసు పలుకుతూ.. ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ కూడా ఆ నో-బాల్‌పై రెండు ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘అంప్లైర్లు దానిని ‘నో-బాల్’గా ప్రకటించడానికి ముందు ఎందుకు రివ్యూ తీసుకోలేదు? ఫ్రీ హిట్ బాల్‌కు కోహ్లి బౌల్డ్ అయినప్పుడు.. దాన్ని డెడ్ బాల్‌గా ఎందుకు ప్రకటించలేదు?’’ అని ట్విటర్ మాధ్యమంగా ప్రశ్నించాడు. ఒక మాజీ క్రికెటర్ ఈ విధంగా స్పందించడంతో.. ఈ నో-బాల్ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. పాక్ అభిమానులైతే మరింత రెచ్చిపోతున్నారు. నడుము ఎత్తుకి పైకి వస్తేనే నో బాల్ అవుతుందని, కానీ ఇక్కడ కోహ్లీ ఒక అడుగు ముందుకేసి మరీ షాట్ కొట్టాడని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ నో-బాల్ కాదని పేర్కొంటున్నారు. ఇది ముమ్మాటికీ చీటింగేనని కామెంట్లు చేస్తున్నారు.
ఏదేమైనా.. మైదానంలో అంతిమ నిర్ణయం అంపైర్లదే కాబట్టి, వారి నిర్ణయాన్ని గౌరవించాలని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఇరు జట్లు కూడా అంపైర్ల నిర్ణయాన్ని గౌరవించి, తమ ఆటని కొనసాగించిన తీరుని గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మ్యాచ్ రిజల్ట్ వచ్చేశాక ‘నో-బాల్’పై ఇంత దుమారం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని హితవు పలుకున్నారు. ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టేస్తే.. చివరి బంతి వరకూ భారత్ అద్భుత పోరాట పటిమ కనబర్చింది. ముఖ్యంగా.. కోహ్లీ తన కెరీర్‌లోనే ఉత్తమ ఇన్నింగ్స్ ఆడి, భారత్‌ని ఒంటిచేత్తో గెలిపించాడు.
