Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!

Pcb Pakistan

Pcb Pakistan

PCB Forced To Sells Broadcast Rights at Half Price: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమ సొంత దేశంలో జరగనున్న 25 అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసార హక్కులను రిజర్వ్ ధరలో సగానికంటే తక్కువకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిడ్డింగ్‌లో కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోని పీటీవీ (Pakistan Television Corporation) మాత్రమే పాల్గొనడంతో.. పీసీబీ నిర్దేశించిన రూ.600 మిలియన్ల రిజర్వ్ ధరకు బదులుగా రూ.350 మిలియన్లకే ప్రసార హక్కులు దక్కించుకుంది. ఈ మేరకు పలు నివేదికలు పేర్కొన్నాయి.

ఇటీవలే ప్రసార హక్కుల కోసం టెండర్‌ను పీసీబీ విడుదల చేసింది. అయితే ఈసారి గతంలో మాదిరిగా ఆసక్తి ఉన్న బ్రాడ్‌కాస్టర్లు కన్సార్టియంగా ఏర్పడి బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అనుమతించలేదు. దీంతో పోటీ బాగా తగ్గిపోయింది. చివరకు ఒక్క పీటీవీ మాత్రమే బిడ్ వేయడంతో.. రూ.600 మిలియన్ల రిజర్వ్ ధర ఉన్న హక్కులు రూ.350 మిలియన్లకే అమ్ముడయ్యాయి. తాజా ఒప్పందంలో మొత్తం 25 అంతర్జాతీయ హోమ్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఇందులో ఐదు టెస్టులు, 14 వన్డేలు, ఆరు టీ20లు ఉన్నాయి. పాకిస్థాన్ ఈ నెలలో శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం ఏడు మ్యాచ్‌ల త్రైపాక్షిక వన్డే సిరీస్‌లో పాల్గొననుంది. వచ్చే నెలలో శ్రీలంకతో రెండు టెస్టులు కూడా షెడ్యూల్ అయ్యాయి.

అయితే పాకిస్థాన్ జాతీయ జట్టు ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వకపోవడం కూడా ప్రసార హక్కులపై ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణమని పీసీబీ వర్గాలు అంటున్నాయి. జట్టు ప్రదర్శన నిరాశాజనకంగా ఉండటంతో స్పాన్సర్లు, ప్రకటనదారులు ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. గతంలో కన్సార్టియాలుగా ఏర్పడి పాకిస్థాన్ క్రికెట్ ప్రసార హక్కులను తీసుకున్న కనీసం మూడు బ్రాడ్‌కాస్టర్లు పీసీబీకి ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉందని సమాచారం. ఈ పరిస్థితి కూడా తాజా బిడ్డింగ్‌లో పోటీదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించినట్లు తెలుస్తోంది.

బకాయిలు ఉన్న బ్రాడ్‌కాస్టర్లను బిడ్డింగ్‌లో పాల్గొనకుండా పీసీబీ నిషేధించలేదని, అయితే వారు స్వయంగా ఈసారి టెండర్‌లో పాల్గొనలేదని సమాచారం. గతంలో పాకిస్థాన్ క్రికెట్ ప్రసార హక్కుల్లో ఎక్కువ భాగాన్ని దక్కించుకున్న ఓ సంస్థ కూడా ఈసారి ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం కుదిరిన ఒప్పందం ప్రకారం 2027 జనవరిలో ఐర్లాండ్‌తో పాకిస్థాన్ ఆడే మూడు టీ20 మ్యాచ్‌లతో పాటు ఐర్లాండ్, జింబాబ్వే పాల్గొనే ఏడు మ్యాచ్‌ల త్రైపాక్షిక సిరీస్ ప్రసార హక్కులు కూడా ఇందులో ఉన్నాయి. అయితే జింబాబ్వే క్రికెట్ బోర్డులో నెలకొన్న అంతర్గత సమస్యల కారణంగా ఆ జట్టు పాకిస్థాన్ పర్యటనకు రావడం కష్టమేనని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. దీంతో ఈ సిరీస్ భవిష్యత్తుపైన అనిశ్చితి నెలకొంది.

పాకిస్థాన్ సూపర్ లీగ్ 11వ ఎడిషన్ సమయంలోనూ పీసీబీకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఈ ఏడాది జరిగిన పీఎస్ఎల్లో రెండు కొత్త జట్లను చేర్చినప్పటికీ.. ప్రసార హక్కుల కోసం పీసీబీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని సమాచారం. గత ఏడాది పీఎస్ఎల్ ప్రసార హక్కులను కొనుగోలు చేసిన ఓ బ్రాడ్‌కాస్టర్‌ కూడా పీసీబీకి బిలియన్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితులు, ప్రసార హక్కుల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసార హక్కులను రిజర్వ్ ధరలో సగానికి పైగా తగ్గించి విక్రయించాల్సి రావడం పీసీబీకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. జాతీయ జట్టు ప్రదర్శన, బ్రాడ్‌కాస్టర్ల బకాయిలు, స్పాన్సర్ల ఆసక్తి తగ్గడం వంటి అంశాలు పాకిస్థాన్ క్రికెట్ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.