టీ20 వరల్డ్‌కప్ 2026లో దాయాది పాకిస్థాన్ బోణీ కొట్టింది. కొలంబో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. నెదర్లాండ్స్ నిర్ధేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని పాక్ 7 వికెట్స్ కోల్పోయి మరో మూడు బంతులు ఉండగా గెలిచింది. పాక్ జట్టు విజయంలో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (47; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు), ఇన్నింగ్స్ చివరలో ఫహీం అష్రఫ్ (29; 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లో గెలిచిన పాక్ ఖాతాలో రెండు పాయింట్స్ చేరాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన నెదర్లాండ్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (37; 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. మైఖేల్ లెవిట్ (24), బాస్ డీ లీడే (30), కోలిన్ అకెర్మాన్ (20) ఫర్వాలేదనిపించారు. మిగతా నెదర్లాండ్స్ బ్యాటర్లు విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3 వికెట్స్ పడగొట్టగా.. మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సయీమ్ అయూబ్ తలో రెండు వికెట్స్ తీశారు. ఇక స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు.
మోస్తరు లక్ష ఛేదనలో పాకిస్థాన్‌కు ఓపెనర్ సైమ్ అయూబ్ మెరుపు ఆరంభం ఇచ్చాడు. 13 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సుతో 24రన్స్ చేశాడు. అయూబ్ అవుట్ అయ్యాక వరుస విరామాల్లో పాక్ వికెట్స్ కోల్పోయింది. అనంతరం సాహిబ్జాదా ఫర్హాన్ వేగంగా పరుగులు చేశాడు. అయితే నెదర్లాండ్స్ బౌలర్ల దాటికి పాక్ 117 పరుగులకు 7 వికెట్స్ కోల్పోయి కష్టాలో పడింది. ఓ దశలో నెదర్లాండ్స్‌కు కూడా గెలిచే అవకాశాలు వచ్చాయి. అయితే ఫహీం అష్రఫ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. మొత్తానికి పాకిస్థాన్‌ను నెదర్లాండ్స్ వణికించింది.
