Shahid Afridi: ఇండియా-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలపై ఇటీవల భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచుల్ని పున:ప్రారంభించడం వల్ల టెస్టు క్రికెట్‌కి పెద్ద ఊపునిస్తుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ స్టార్ ప్లేయర్ షాహీద్ అఫ్రిది స్పందించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల కారనంగా దశాబ్ధకాలంగా ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు.
Read Also: Ajit Pawar: ఈ ఎన్నికలు ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ మధ్య యుద్ధం..
క్లబ్ ఫ్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్ చర్చ సందర్భంగా.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ రోహిత్ శర్మని ప్రశ్నిస్తూ… ‘‘భారతదేశం పాకిస్తాన్‌తో క్రమం తప్పకుండా ఆడటం టెస్ట్ క్రికెట్‌కి అద్భుతంగా ఉంటుందని మీరు అనుకోవడం లేదా..?’’ అని అడిగారు. ఈ ప్రశ్నకు రోహిత్ శర్మ బదులిస్తూ..‘‘ నేను దీన్ని పూర్తిగా నమ్ముతున్నాను, వారిది మంచి జట్టు, అద్భుతమైన బౌలింగ్ లైనప్ ఉంది. మంచి పోటీ ఇస్తుంది. చివరి టెస్ట్ 2007-08లో జరిగింది. పాకిస్తాన్‌తో ఆడటానికి నేను ఇష్టపడుతాను. ఇరు జట్ల మధ్య పోటీ గొప్పగా ఉంటుంది. ఐసీసీ ట్రోఫీల్లో వారితో ఆడుతున్నాము.’’ అని అన్నారు.
రోహిత్ వ్యాఖ్యలపై అఫ్రిది స్పందిస్తూ ఇది సానుకూల ప్రకటన అని ప్రశంసించారు. భారత్-పాకిస్తాన్ మద్య విభేదాలను పరిష్కరించడానికి క్రీడలు సహాయపడతాయని అన్నారు. ‘‘భారత కెప్టెన్ నుంచి ఇది సానుకూల ప్రకటన. అతను భారత రాయబారి కూడా. పాకిస్తాన్-ఇండియా మధ్య సంబంధాల గురించి మేము ఎప్పటి నుంచో చెప్పాము. క్రీడలు ముఖ్యంగా క్రికెట్ గురించి మాట్లాడాం. మేము భారత్ వెళ్లి క్రికెట్ ఆడేవాళ్లం ఇది సంబంధాలను పెంచుతుంది. మంచి సంబంధాలను కలిగి ఉండటం పొరుగువారి హక్కు’’ అని అఫ్రిది సమా టీవీతో అన్నారు.