NTV Telugu Site icon

World Athletics Championship: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. 19 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం

Neeraj Chopra

Neeraj Chopra

World Athletics Championship: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో భారత స్టార్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని యూజీన్‌లో ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌కు ఇది రెండో పతకం మాత్రమే. గతంలో మహిళా అథ్లెట్ పతకం నెగ్గగా పురుషులలో మాత్రం ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్ నీరజ్ చోప్రానే కావడం విశేషం. 2003లో పారిస్​ వేదికగా జరిగిన వరల్డ్​ అథ్లెటిక్స్​ ఛాంపియన్‌షిప్‌లో మహిళా అథ్లెట్ అంజు బాబి జార్జ్​ లాంగ్​ జంప్​ విభాగంలో కాంస్య పతకం గెల్చుకున్నారు.

Read Also: Panipuri Challenge: ఈ పానీపూరీ తింటే రూ.500 మీదే..!!

కాగా ఈరోజు జరిగిన ఫైనల్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 88.13 మీటర్ల దూరం త్రో చేశాడు. గోల్డ్ మెడల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 90.46 మీటర్ల దూరం విసిరాడు. అతడు తొలి ప్రయత్నంలోనే 90.46 మీటర్ల దూరం త్రో చేశాడు. మూడో స్థానంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన అథ్లెట్ వాద్లెచ్ నిలిచాడు. అతడు 88.09 మీటర్ల దూరం జావెలిన్‌ను త్రో చేయగలిగాడు. ఫైనల్లో నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు. రెండో ప్రయత్నంలో 82.39 మీటర్లు దూరం జావెలిన్ విసిరాడు. మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు జావెలిన్ విసిరాడు. నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు జావెలిన్ విసిరి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.