ఈనెల 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఒడిశా కటక్‌లోని బారాబతి స్టేడియంలో జూన్ 12న రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ మ్యాచ్‌కు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన తొలి టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మొహంతి, కార్యదర్శి సంజయ్ బెహెరా సీఎం నవీన్ పట్నాయక్‌కు తొలి టికెట్ అందజేశారు.
మరోవైపు కటక్ స్టేడియం వద్ద టిక్కెట్ల విక్రయం కోసం చేసిన ఏర్పాట్లను ఒడిశా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి బెహరా సీఎం నవీన్ పట్నాయక్‌కు వివరించారు. కాగా కటక్ స్టేడియంలో టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుతో తలపడడం ఇది రెండోసారి. 2015లో కటక్ వేదికగా ఇరు జట్ల టీ20 మ్యాచ్ జరగ్గా అప్పట్లో టీమిండియా ఓడిపోయింది. ఆరు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి దక్షిణాఫ్రికా జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.
