Devdutt Padikkal: భారత్ కష్టాల్లో పడేది.. మా టార్గెట్ అదే.. పడిక్కల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nz Vs Ind Devdutt Padikkal

Nz Vs Ind Devdutt Padikkal

NZ vs IND 1st Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి గిల్ సేన 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 118 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (136) సెంచరీ చేయగా.. యశస్వి జైస్వాల్ (85), దేవదత్ పడిక్కల్ (80), శుభ్‌మన్ గిల్ (98), రిషభ్‌ పంత్ (55 నాటౌట్) హాఫ్ సెంచరీలు బాదారు. మూడోరోజు ఆట ముగిసిన అనంతరం పడిక్కల్ తన ఇన్నింగ్స్‌తో పాటు రాహుల్‌తో నెలకొల్పిన భాగస్వామ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌పై ఒత్తిడి పెంచి గెలవడమే తమ టార్గెట్ అని చెప్పాడు.

తన బ్యాటింగ్ ప్రదర్శనపై పడిక్కల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘పరుగులు చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఈరోజు ఆటను నేను, కేఎల్ రాహుల్ మంచి ఆరంభంతో ప్రారంభించడం కీలకంగా మారింది. ప్రత్యర్థి జట్టుకు తిరిగి మ్యాచ్‌లోకి వచ్చే అవకాశం ఇవ్వకూడదని భావించాము. ఆ విషయంలో మేము విజయవంతమయ్యాం. తొలి సెషన్‌లో వికెట్లు కోల్పోకుండా ఆడటం చాలా ముఖ్యం. ఆరంభంలోనే న్యూజిలాండ్ రెండు వికెట్లు తీసి ఉంటే భారత్ కష్టాల్లో పడేది. అందుకే రాహుల్‌తో కలిసి వీలైనంత ఎక్కువసేపు భాగస్వామ్యాన్ని కొనసాగించాలని చూశాను. ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాం’ వెల్లడించాడు.

న్యూజిలాండ్‌లో తొలిసారి ఆడుతున్న పడిక్కల్.. బేసిన్ రిజర్వ్ మైదానంపై ప్రశంసలు కురిపించాడు. ‘ఇక్కడ క్రికెట్ ఆడటం ఎంతో బాగుంది. ఈ పిచ్‌పై గడ్డి ఎక్కువగా ఉంటుంది. బంతి ఎక్కువ స్వింగ్ అవుతుందని ఊహించాము. అయితే మేము అనుకున్న దానికంటే పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉంది. అయినప్పటికీ పరిస్థితులను గౌరవిస్తూ, వాటికి అనుగుణంగా ఆడాం. డ్రెస్సింగ్ రూమ్‌లో భారత ఆటగాళ్లంతా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఈ టెస్టుకు ముందు ప్రతి ఒక్కరూ మంచి ప్రాక్టీస్‌తో సిద్ధమయ్యారు. అది మైదానంలో కనిపిస్తోంది. భారీ స్కోర్లు సాధించడంపైనే జట్టు దృష్టి పెట్టింది’ అని పడిక్కల్ పేర్కొన్నాడు.

భారత్ ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నప్పటికీ, ముందుగానే లక్ష్యాలను నిర్ణయించుకోవడం లేదని పడిక్కల్ స్పష్టం చేశాడు. ఒక్కో సెషన్‌పై దృష్టి పెట్టి ఆడాలని భావిస్తున్నామని చెప్పాడు. వీలైనంత ఎక్కువ ఆధిక్యాన్ని సంపాదించి, రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌పై మరింత ఒత్తిడి పెంచడమే తమ లక్ష్యమని పడిక్కల్ వెల్లడించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 118 పరుగుల ఆధిక్యంలో ఉండటంతో మ్యాచ్‌పై పట్టు బిగించింది. నాలుగో రోజు భారత బ్యాటర్లు ఈ ఆధిక్యాన్ని ఎంతవరకు పెంచుతారన్నది ఆసక్తికరంగా మారింది.