Team India Worst ODI Record: భారత పురుషుల క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో 0/3 స్కోరుతో తొలి మూడు వికెట్లు కోల్పోయిన ఐదో జట్టుగా భారత్ నిలిచింది. బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఈ చెత్త రికార్డును నమోదు చేసింది. 334 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు కోల్పోయింది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకముందే.. స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ డకౌట్‌గా పెవిలియన్ చేరారు. న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో ఈ ముగ్గురినీ ఔట్ చేశాడు.
వన్డేల్లో ఇలా స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా లేకుండా తొలి మూడు వికెట్లు కోల్పోవడం ఇది ఐదోసారి. గతంలో పాకిస్థాన్ రెండుసార్లు ఈ పరిస్థితిని ఎదుర్కొంది. 1983 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, 1997లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ 0/3 స్కోరుతో మూడు వికెట్లు కోల్పోయింది. 2003 ప్రపంచ కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కూడా ఇలానే వికెట్స్ కోల్పోయింది. 2026లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సైతం స్కోరు బోర్డుపై పరుగు చేరకముందే మూడు వికెట్లు చేజార్చుకుంది. తాజాగా మౌంట్ మాంగనుయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఈ జాబితాలో చేరింది.
మరోవైపు ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ డకౌట్ కావడం కూడా ప్రత్యేకంగా నిలిచింది. వీరిద్దరూ ఒకే వన్డే మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే ఔట్ కావడం ఇది రెండోసారి. అంతకుముందు 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్, కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగారు. భారత క్రికెట్ అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఒకే మ్యాచ్‌లో డకౌట్ కావడం, అదే మ్యాచ్‌లో భారత్ 0/3తో చెత్త రికార్డును నమోదు చేయడం తీవ్ర నిరాశకు గురిచేసింది. న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీ ఒకే ఓవర్‌లో ముగ్గురు కీలక భారత బ్యాటర్లను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

