NTV Telugu Site icon

ICC Rankings: టీమిండియాతో వన్డే సిరీస్ ఎఫెక్ట్.. న్యూజిలాండ్ నంబర్‌వన్ ర్యాంక్ పాయె..!!

Icc Ranks

Icc Ranks

ICC Rankings: టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే న్యూజిలాండ్ ఓడిపోయింది. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన అసలే వన్డే సిరీస్ ఓడిపోయిన బాధలో ఉన్న న్యూజిలాండ్‌కు మరో షాక్ తగిలింది. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ రెండో స్థానానికి పడిపోయింది. దీంతో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అయితే మూడో వన్డేలోనూ భారత్ గెలిస్తే న్యూజిలాండ్ మూడో స్థానానికి పడిపోవడంతో పాటు టీమిండియా నంబర్‌వన్‌గా అవతరించనుంది.

Read Also: Wasim Jaffer: టీమిండియా స్టార్ ఆటగాళ్లందరూ రంజీలు ఆడాల్సిందే..!!

ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్, టీమిండియాకు సమానంగా 113 పాయింట్లే ఉన్నాయి. అయితే సాంకేతికంగా ఇంగ్లండ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. న్యూజిలాండ్, టీమిండియా జట్లు రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. రెండో వన్డేకు ముందు కివీస్ 115 పాయింట్లతో ఐసీసీ ర్యాంకుల్లో మొదటి స్థానంలో ఉంది. 113 పాయింట్లతో ఇంగ్లండ్, 112 పాయింట్లతో ఆస్ట్రేలియా, 111 పాయింట్లతో టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. రెండో వన్డేలో కివీస్ ఘోరంగా ఓడిపోవడంతో ర్యాంకులు తారుమారయ్యాయి. రాయ్‌పూర్ వన్డేలో గెలవడంతో టీమిండియా ఖాతాలో రెండు పాయింట్లు చేరగా.. కివీస్ ఖాతాలో రెండు పాయింట్లు తగ్గాయి. దీంతో టాప్-3లో ఉన్న జట్ల పాయింట్లు సమం అయ్యాయి. కాగా ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో, పాకిస్థాన్ 106 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతున్నాయి.