T20 World Cup: క్రికెట్‌లో న్యూజిలాండ్ పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. గ్రూప్ స్టేజీలో దుమ్మురేపేలా ఆడతారు. నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రం చేతులెత్తేస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు ఒక ఫోబియా ఉంటే.. న్యూజిలాండ్ జట్టుకు మరో ఫోబియా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో చూసుకుంటే 2019 ప్రపంచకప్ ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్, ఇప్పుడు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్.. ఇలా మూడు ప్రపంచకప్‌లలోనూ న్యూజిలాండ్ బోల్తా కొట్టింది. దీంతో పాపం న్యూజిలాండ్ అనిపించక మానదు. పలువురు అభిమానులు అయ్యో కేన్ మామ అంటూ సానుభూతి చూపుతున్నారు. ఎందుకంటే భారత్‌లోనూ కేన్ విలియమ్సన్‌కు అభిమానులు ఉన్నారు. ఐపీఎల్ వంటి మెగా టీ20 లీగ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సన్‌రైజర్స్ జట్టుకు విలియమ్సన్ నాయకత్వం వహిస్తున్నాడు. అందుకే తెలుగు అభిమానులు సైతం అయ్యో అంటూ నిట్టూరుస్తున్నారు.
Read Also: New rule for TV channels: టీవీ ఛానెళ్లకు కొత్త రూల్.. ఇకపై ప్రతీరోజూ 30 నిమిషాలు ఇవి తప్పనిసరి..
న్యూజిలాండ్ పరిస్థితి ఇప్పుడే ఇలా ఉందనుకుంటే పప్పులో కాలేసినట్లే. గతంలోనూ సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు వెళ్లి ఇంటి బాట పట్టేది. 1975, 1979 1992, 1999, 2007, 2011 ప్రపంచకప్ సెమీస్‌లలో న్యూజిలాండ్ జట్టు ఓటమి పాలైంది. 2015, 2019 ప్రపంచకప్‌లలో ఫైనల్ వరకు వచ్చి టైటిల్ గెలవకుండానే రిక్తహస్తాలతో వెనుతిరిగింది. ముఖ్యంగా 2015 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్‌లలో న్యూజిలాండ్‌ను ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. 2007 టీ20 ప్రపంచకప్, 2022 టీ20 ప్రపంచకప్‌లలో సెమీస్ పోరులో పాకిస్థాన్ విజయం సాధించడంతో న్యూజిలాండ్ ఇంటిదారి పట్టింది. 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది.