NTV Telugu Site icon

రెండో వన్డేలో టీమిండియా గెలిస్తే సరికొత్త రికార్డ్‌…

టీమిండియా మరో రికార్డు ముంగిట నిలిచింది. లంకపై అత్యధిక వన్డేల్లో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించేందుకు… ఒక్క మ్యాచ్‌ దూరంలో ఉంది. ఇవాళ జరిగే రెండో వన్డేలో భారత్‌ గెలిస్తే… ఆ లాంఛనం పూర్తవుతుంది.

శ్రీలంకతో ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టిన భారత కుర్రాళ్లు.. రెండో వన్డేకు సిద్దమయ్యారు. ఇవాళ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సెకండ్‌ వన్డే జరగనుంది. తొలి వన్డేలో లంకపై ఘన విజయం సాధించిన భారత జట్టు… అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీలంకపై వన్డేల్లో భారత్‌కు ఇది 92వ విజయం. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సరసన ఇప్పుడు భారత్‌ కూడా చేరింది. న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా, శ్రీలంకపై పాకిస్థాన్ అన్నేసార్లు విజయం సాధించాయి. ఇవాళ శ్రీలంకతో జరగనున్న రెండో వన్డేలోనూ గబ్బర్‌ సేన విజయం సాధిస్తే… ఒకే జట్టుపై అత్యధిక మ్యాచుల్లో విజయం సాధించిన ప్రపంచ రికార్డు… భారత్ సొంతమవుతుంది.

పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్పే భారత్‌కు బలం. కెప్టెన్‌ శిఖర్‌ధావన్‌తో పాటు యువ ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీష్‌ పాండే… అంతా హార్డ్‌ హిట్టర్లే. వీళ్లకు కళ్లెం వేయడం అంటే… ప్రస్తుత లంక జట్టుకు శక్తికి మించిన పనే. బౌలింగ్‌లోనూ మన ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్య తొలివన్డేలో ఆకట్టుకునేలా బౌలింగ్‌ వేశారు. వీళ్లకి తోడు హార్దిక్‌ పాండ్యా, సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఎలాగూ ఉన్నారు. అంతా కలిసి లంక పని పడితే… రెండో వన్డేలోనూ గెలుపు ఖాయమన్న ధీమాతో ఫ్యాన్స్‌ ఉన్నారు.

ఇక లంక జట్టులో కూడా సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. అయితే నిలకడగా ఆడి భారీ స్కోర్లు సాధించడంలో మాత్రం విఫలమవుతున్నారు. టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడితే… భారీ స్కోరు ఖాయమని నమ్మకంగా ఉన్నారు… లంక ఫ్యాన్స్‌. అయితే లంక బౌలింగ్‌ విభాగం మాత్రం చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఒకరిద్దరు తప్ప తొలి వన్డేలో ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. లంక బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌కు కళ్లెమేయాలంటే… కష్టపడక తప్పదు. రెండో వన్డేలో గెలిచి భారత్‌ కొత్త రికార్డు అందుకుంటుందా? లేక లంక రెచ్చిపోయి సిరీస్‌ను సమం చేస్తుందా? అనేది ఇవాళ తేలిపోతుంది.