Site icon NTV Telugu

Neeraj Chopra: డైమండ్ లీగ్‌లో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

Neeraj Chopra

Neeraj Chopra

Neeraj Chopra:  భారత స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు, ఒలింపిక్ ఛాంపియన్ 24 ఏళ్ల నీరజ్ చోప్రా ప్రఖ్యాత డైమండ్ లీగ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు. స్విట్జర్లాండ్‌లోని సుసానెలో జరుగుతున్న డైమండ్ లీగ్‌లో మొదటి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.08 మీటర్ల దూరం విసిరి అందరికంటే ముందంజలో నిలిచాడు. రెండో ప్రయత్నంలో 85.18 మీటర్ల దూరం వేశాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ చోప్రా ఈటెను విసరలేదు. నాలుగో ప్రయత్నంలో ఫౌల్‌ చేశాడు. ఇక చివరి ప్రయత్నంలో 80.04 మీటర్లు మాత్రమే విసరగలిగాడు.

Read Also: Ban Sale Of Petrol-Powered Cars: పెట్రోల్‌ కార్లపై నిషేధం..! ఎప్పటి నుంచి అమలంటే..?

అయితే నీరజ్ చోప్రా కంటే ఎక్కువ దూరం ఎవరూ వేయకపోవడంతో అతడు తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. దీంతో సెప్టెంబర్‌ 7, 8 తేదీల్లో జరుగనున్న జ్యూరిచ్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు. అంతేకాకుండా వచ్చేఏడాది బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ బెర్తు కూడా నీరజ్ చోప్రా ఖరారు చేసుకున్నాడు. కాగా తన ప్రదర్శన పట్ల నీరజ్ చోప్రా సంతృప్తిని వ్యక్తం చేశాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇలాంటి ఫలితం రావడం ఆనందంగా ఉందన్నాడు. గాయం వల్ల కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనలేకపోయానని.. కానీ ఈ రిజల్ట్ తన ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచిందని పేర్కొన్నాడు. జ్యురిచ్‌లో జరిగే ఫైనల్‌లో అత్యుత్తమంగా రాణిస్తానన్న నమ్మకం వచ్చిందని తెలిపాడు.

Exit mobile version