Duleep Trophy 2026: ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు కొత్త చర్చ సాగుతోంది.. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ తర్వాత.. అంత కూల్‌గా ఆలోచించే వ్యక్తి ఈ బేబీబాస్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.. దీనికి కారణం డీఆర్ఎస్ లే.. దులీప్ ట్రోఫీ 2026లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తోనే కాకుండా మైదానంలో తీసుకున్న తెలివైన నిర్ణయాలతోనూ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా డీఆర్ఎస్ విషయంలో అతని సమయస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం భవిష్యత్‌లో అతను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగలడనే సంకేతాలను ఇస్తున్నాయి.
ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఉన్న వైభవ్.. సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్‌లో రికీ భూయి క్యాచ్ అవుట్ విషయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. దీంతో రివ్యూ తీసుకోవాలని కెప్టెన్ ఇషాన్ కిషన్‌ను వైభవ్ ఒప్పించాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతికి బ్యాట్ ఎడ్జ్ తగిలినట్లు స్పష్టమవడంతో నిర్ణయం మారింది. రికీ భూయి ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఇక, సెమీఫైనల్‌లోనూ వైభవ్ డీఆర్ఎస్ విషయంలో తన ప్రతిభను చాటుకున్నాడు. సెంట్రల్ జోన్‌తో మ్యాచ్‌లో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన అతను.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఆర్యన్ జుయల్‌పై క్యాచ్ అప్పీల్‌కు రివ్యూ తీసుకోవాలని నిర్ణయించాడు. సమయం ముగియడానికి దగ్గరగా ఉన్నప్పటికీ తన అంతర్జ్ఞానాన్ని నమ్మాడు. అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ రావడంతో ఆర్యన్ జుయల్ అవుట్‌గా ప్రకటించారు.
క్రికెట్‌లో డీఆర్ఎస్ నిర్ణయాలకు కెప్టెన్ సమయస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం ఎంతో కీలకం. ఈ విషయంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ధోనీ తీసుకునే రివ్యూల కారణంగా డీఆర్ఎస్‌ను సరదాగా ‘ధోనీ రివ్యూ సిస్టమ్’ అని కూడా పిలిచేవారు. ఇప్పుడు వైభవ్ కూడా తన రివ్యూ నిర్ణయాలతో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బ్యాటింగ్‌లోనూ వైభవ్ మంచి ప్రదర్శన చేశాడు. దులీప్ ట్రోఫీలో రెండు మ్యాచ్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన అతను 12 ఫోర్లు, 9 సిక్సర్లతో 148 పరుగులు సాధించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌కు తోడు ఆటను అర్థం చేసుకుని ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కనిపిస్తుండటంతో.. భవిష్యత్‌లో వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా ఎదగగలడనే చర్చ మొదలైంది.. ఇప్పటికే టీ20 టీమ్‌లో స్థానం సంపాదించుకున్న ఈ బేబీబాస్.. క్రమంగా టీమిండియాలో మరింత ఎత్తుకు ఎదుగాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..

