Site icon NTV Telugu

IPL 2022: రాణించిన కోల్‌కతా టాపార్డర్.. ముంబై టార్గెట్ 166

Mumbai Vs Kolkata

Mumbai Vs Kolkata

ముంబైలోని డా. డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఈ ఐపీఎల్ సీజన్‌లోని 56వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి ముంబై బౌలింగ్ ఎంచుకోగా, కోల్‌కతా బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. తొలుత కోల్‌కాతా టాపార్డర్ సృష్టించిన విధ్వంసం చూసి.. ముంబై ముందు భారీ లక్ష్యం పెడతారని అంతా అనుకున్నారు.

గత కొన్ని మ్యాచుల్లో పెద్దగా ఫామ్‌లో లేని వెంకటేశ్ అయ్యర్, ఈ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. రహానే (24 బంతుల్లో 25) పెద్దగా ఆడలేదు కానీ, అయ్యర్‌కి సహాయం అందించాడు. ఆ తర్వాత వచ్చిన నితీశ్ రానా.. 26 బంతుల్లో 3 ఫోర్సు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. టాపార్డర్ అదరగొట్టేయడంతో, కోల్‌కతా ఈరోజు 200 పరుగుల మార్జిన్‌ని దాటేస్తుందని భావించారు. కానీ, అందుకు భిన్నంగా వికెట్లు వరుసగా పడ్డాయి. రింకు సింగ్ (19 బంతుల్లో 23) ఒక్కడే నిలకడగా రాణిస్తే, మిగతా వాళ్ళు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయారు. దీంతో, కోల్‌కతా స్కోరు 165/9 వద్దే ఆగిపోయింది.

ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా తన బంతితో మాయ చేయగలిగాడు. 4 ఓవర్లలో ఒకటి మెయిడన్ ఓవర్ వేసి, కేవలం 10 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. కుమార్ కార్తికేయ కాస్త పరుగులు సమర్పించినా.. (3 ఓవర్లలో 32 పరుగుల) 2 వికెట్లు తీయగలిగాడు. డేనియల్, మురుగన్ అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నాడు. బుమ్రా తిరిగి ఫామ్‌లోకి రావడం వల్లే, కోల్‌కతాని 165 పరుగుల వద్దే కట్టడి చేయగలిగారు. మరి, తమ ముందున్న లక్ష్యాన్ని ముంబై చేధిస్తుందా? లేదా? వేచి చూడాలి.

Exit mobile version