మరో రెండు వారాల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు శుభవార్త అందింది. ఆ జట్టు మెగా వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. మైదానంలో ఆర్చర్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన ముంబై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ చేసిన ఈ ట్వీట్‌ను బట్టి ఆర్చర్ ఈ సీజన్‌లో బరిలోకి దిగుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ఆర్చర్ దూరం అవుతాడని అందరూ భావించారు. ఎందుకంటే గాయంతో అతడు ఇంగ్లండ్ జట్టు ఆడే మ్యాచ్‌లకు కూడా దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం అతడు ప్రాక్టీస్ ప్రారంభించడంతో ఐపీఎల్‌లో ఆడతాడనే సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల జరిగిన మెగా వేలంలో ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 35 మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్ 46 వికెట్లు తీశాడు. అటు బ్యాటింగ్‌లో 195 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 27 పరుగులుగా ఉంది.
