Mumbai Indians Lost The Match Against GT By 62 Runs: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం పాలైంది. జీటీ నిర్దేశించిన 234 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఛేధించలేకపోయింది. 171 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. దీంతో.. 62 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించి, ఫైనల్స్‌కు చేరింది. ఆరంభంలోనే ముంబై రెండు వికెట్లు కోల్పోవడం.. సూర్య (61), తిలక్ వర్మ (43) మినహాయించి మరే ముంబై బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడం వల్లే.. ముంబై ఈ ఓటమి తప్పలేదు. ఇది అత్యంత కీలక మ్యాచ్ కాబట్టి.. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో తన జట్టుని కాపాడుకుంటాడని భావిస్తే.. ఎప్పట్లాగే ఈసారి అతడు ఫ్యాన్స్ ఆశల్ని నీరుగార్చేశాడు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. సెంచరీతో శుబ్మన్ గిల్ (60 బంతుల్లో 129) వీరవిహారం చేయడం.. సాయి సుదర్శన్ (43) మెరుగ్గా రాణించడం.. చివర్లో హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. జీటీ అంత భారీ స్కోరు చేయగలిగింది. ముఖ్యంగా.. శుబ్మన్ అయితే ముంబై బౌలర్లతో ఫుట్‌బాల్ ఆడేసుకున్నాడు. ఆరో ఓవర్‌లోనే జోర్డాన్ బౌలింగ్‌లో ఔట్ అవ్వాల్సిన శుబ్మన్‌కి లైఫ్ దక్కడంతో.. దాన్ని అతడు పూర్తిగా సద్వినియోపరచుకున్నాడు. ఎడాపెడా షాట్లతో మైదానంలో బౌండరీల వర్షం కురిపించి, తన జట్టుకి భారీ స్కోరు అందించడంలో విజయవంతం అయ్యాడు. అనంతరం 234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 18.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటై, 62 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
క్రీజులోకి వచ్చిన ఆరంభంలోనే ముంబైకి రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. వాధేరా (4), రోహిత్ శర్మ (8) వెనువెంటనే ఔట్ అయ్యారు. గ్రీన్ హర్ట్ అవ్వడంతో, కాసేపు రెస్ట్ తీసుకున్నాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ కాసేపు తాండవం చేశాడు. 14 బంతుల్లోనే 43 పరుగులు చేసి.. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. షమీ లాంటి మేటి బౌలర్‌లో 24 పరుగులు బాదేశాడు. అతని దూకుడు చూసి, ముంబై ఈ భారీ లక్ష్యాన్ని ఛేధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. రషీద్ అతని వికెట్ పడగొట్టి, ముంబై ఆశలపై నీళ్లు చల్లేశాడు. సూర్య, గ్రీన్ ఉన్నంతవరకు.. ముంబై గెలుస్తుందనే ఆశలు ఉండేవి. కానీ.. వాళ్లు కూడా ఔట్ అయ్యాక, ముంబై జెండా ఎత్తేసింది. మోహిత్ శర్మ 5 వికెట్లతో చెలరేగగా.. షమీ, రషీద్ చెరో రెండు వికెట్లు, లిటిక్ ఒక వికెట్ పడగొట్టారు.