Site icon NTV Telugu

IPL 2022: ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. టోర్నీలో వరుసగా 8వ ఓటమి

Lucknow Win

Lucknow Win

ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులే చేయగలిగింది. ముంబై జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం ముంబై జట్టుపై భారీగా పడుతోంది. ఈ ఇద్దరు యువఆటగాళ్లు కుదరుకోకుంటే టీమిండియాలో స్థానం గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్‌ను భారీ ధరకు వేలంలో కొనుగోలు చేసిన ముంబై జట్టుకు ఒకరకంగా ఇది షాక్ అనే చెప్పాలి.

కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 39, తిలక్ వర్మ 38, పొలార్డ్ 19 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 3 వికెట్లు, ఆయుష్ బదోని, రవి బిష్ణోయ్, మొహ్‌సిన్ ఖాన్, హోల్డర్ ఒక్కో వికెట్ తీశారు. ఐపీఎల్‌ హిస్టరీలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా 8 ఓటములను చవిచూడలేదు. ఈ చెత్త రికార్డు ముంబై ఇండియన్స్ జట్టుకే సొంతమైంది. తాజా విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఆ జట్టు ఖాతాలో ఐదు విజయాలు, మూడు పరాజయాలు ఉన్నాయి.

IPL 2022: ప్లే ఆఫ్స్ వేదికలు ఖరారు.. ఆ రెండు వేదికల్లోనే మ్యాచ్‌లు

Exit mobile version