MS Dhoni Slams Kuldeep Yadav: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి మైదానంలో ఎంతటి వ్యూహరచనా నైపుణ్యం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతలను గుర్తించి, బౌలర్లకు తగిన సూచనలు చేస్తూ వికెట్లు పడగొట్టడంలో ధోనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే తన సూచనలను బౌలర్లు పట్టించుకోకపోతే.. ధోనీ ఎంత సీరియస్‌గా స్పందిస్తాడో తాజాగా భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. 2017లో శ్రీలంకతో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో ధోనీ తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనను అతడు తాజాగా గుర్తుచేసుకున్నాడు.
2017లో ఇండోర్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో శ్రీలంక బ్యాటర్ కుశాల్ పెరీరా క్రీజులో ఉన్నాడు. అతడిని ఔట్ చేసేందుకు కుల్దీప్కు ఎంఎస్ ధోనీ ఓ ప్రత్యేకమైన వ్యూహాన్ని సూచించాడు. పాయింట్లో ఉన్న ఫీల్డర్‌ను ముందుకు తీసుకురావాలని, కవర్స్‌లో ఉన్న మరో ఫీల్డర్‌ను బౌండరీ వద్దకు పంపించాలని చెప్పాడు. ఆఫ్ స్టంప్‌కు వెలుపల బంతులు వేయాలని, అలా చేస్తే బ్యాటర్ టాప్ ఎడ్జ్ ఇచ్చే అవకాశం ఉందని వివరించాడు. అయితే ధోనీ సూచించిన విధంగా కుల్దీప్ బౌలింగ్ చేయలేదు. దీంతో ధోనీ అతడి వద్దకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయడం లేదు?. నేను తెలివితక్కువవాడిని అని అనుకుంటున్నావా? ఊరికే ఏమీ 300కు పైగా వన్డే మ్యాచ్‌లు ఆడలేదు కదా?’ అంటూ ప్రశ్నించాడు. ధోనీ అలా మాట్లాడటంతో తాను ఒక్కసారిగా భయపడిపోయానని కుల్దీప్ గుర్తుచేసుకున్నాడు.
ఆ తర్వాత ఎంఎస్ ధోనీ చెప్పినట్లుగానే పాయింట్ ఫీల్డర్‌ను ముందుకు తీసుకొచ్చారు. కుల్దీప్ యాదవ్ ఆఫ్ స్టంప్‌కు వెలుపల బంతి వేయగా.. కుశాల్ పెరీరా టాప్ ఎడ్జ్ ఇచ్చాడు. బంతి బౌండరీ వద్ద ఉన్న ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లడంతో పెరీరా పెవిలియన్ చేరాడు. ధోనీ ముందుగానే ఊహించినట్లుగా వికెట్ పడటంతో అతడి క్రికెట్ పరిజ్ఞానం మరోసారి నిరూపితమైందని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్‌లో కుల్దీప్ మూడు వికెట్లు పడగొట్టగా, మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ నాలుగు వికెట్లు తీశాడు. దీంతో భారత్ 88 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 43 బంతుల్లోనే 118 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

