MS Dhoni: టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియాలో లైవ్‌లోకి వస్తానని.. గుడ్ న్యూస్ చెప్తానని శనివారం ప్రకటించాడు. దీంతో ధోనీ చెప్పే గుడ్ న్యూస్‌పై చాలా మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే ధోనీ లైవ్‌లోకి వచ్చి చెప్పిన విషయం తెలిస్తే మీరు షాకవుతారు. ఇంతకీ ధోనీ ప్రకటించిన విషయం ఏంటంటే.. ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ ఓరియోను లాంచ్ చేశాడు. అయితే ఇది కమర్షియల్ ప్రకటన కావడంతో అభిమానులు మండిపడుతున్నారు. కమర్షియల్ ప్రకటన కోసం ముందుగా గుడ్ న్యూస్ అని ప్రకటించడం దేనికంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు 2011లో ఓరియో బిస్కెట్ బ్రాండ్‌ను ప్రారంభించినప్పుడు భారత్ ప్రపంచకప్ గెలిచిందని.. ఇప్పుుడ మరోసారి ఓరియో బిస్కెట్ బ్రాండ్ ఆవిష్కరించడంతో ఈ ఏడాది భారత్ ప్రపంచ కప్ గెలుస్తుందని ధోనీ కవర్ చేశాడు.
Read Also:IND Vs AUS: డిసైడర్ మ్యాచ్.. ఫ్యాన్స్ హంగామా .. బెట్టింగ్ జోరు..!!
ఈ సందర్భంగా ధోనీకి అభిమానుల ఎమోషన్స్‌తో ఆడుకోవడం అలవాటైందని సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ ప్రకటనలపై ఉన్న ధ్యాసతో అభిమానులతో ఇలా ఆడుకోవడం పద్ధతి కాదంటూ హితవు పలుకుతున్నారు. కమర్షియల్ ఆదాయం కోసం అభిమానాన్ని బలిపెట్టొద్దంటూ సూచిస్తున్నారు. అయినా ఓరియో బిస్కెట్ లాంచ్ చేస్తే ఇండియా ప్రపంచ కప్ గెలవడమేంటని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. ప్రపంచ కప్‌లో 11 మంది ఆడితేనే జట్టు గెలుస్తుందని.. ఓరియో బిస్కెట్ ఆవిష్కరించడం వల్లో, తినడం వల్లో ఇండియా గెలవదని సెటైర్లు వేస్తున్నారు. గతంలో గంగూలీ కూడా ఎడ్యుకేషన్ యాప్ కోసం ఇలాగే హంగామా చేశాడని.. అయినా ఇలాంటి ప్రకటనల కోసం గుడ్ న్యూస్ అంటూ అభిమానుల టైం వేస్ట్ చేయడం సరికాదని ధోనీని నెటిజన్‌లు హెచ్చరిస్తున్నారు.
