Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!

Mohammed Siraj Rare Record

Mohammed Siraj Rare Record

Mohammed Siraj Rare Record: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో నిరాశ ఎదురైంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సిరాజ్.. ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నిర్ణయం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు హైదరాబాద్ డీఎస్పీ సిరాజ్ కెరీర్‌లోనే ఒక అరుదైన రికార్డుకు తెరపడింది.

2020లో టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి మహమ్మద్ సిరాజ్ విదేశాల్లో భారత్ ఆడిన ప్రతి టెస్టు సిరీస్‌లో కనీసం ఒక మ్యాచ్‌లోనైనా ఆడాడు. గత ఆరేళ్లుగా కొనసాగిన ఈ పరంపర.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ముగిసింది. ప్రస్తుత సిరీస్‌లోని తొలి రెండు టెస్టుల్లోనూ అతడికి తుది జట్టులో అవకాశం దక్కకపోవడంతో ఆరేళ్ల రికార్డు బ్రేక్ అయింది. దీంతో సిరాజ్ కెరీర్‌లో ఈ సిరీస్ ఓ చేదు అనుభవంగా మిలిగింది. సిరాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున 48 టెస్టుల్లో 144 వికెట్స్ పడగొట్టాడు. టెస్టుల్లో సిరాజ్ బెస్ట్ బౌలింగ్ గణాంకాలు 6/15. టెస్టుల్లో 8సార్లు 4 వికెట్ల ప్రదర్శన, 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది.

మహమ్మద్ సిరాజ్‌తో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా తుది జట్టులోకి తీసుకోకపోవడంపై పలువురు క్రికెట్ విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సైతం జట్టు ఎంపికపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా క్రైస్ట్‌చర్చ్ టెస్టులో జడేజాను పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మాట్లాడిన గవాస్కర్.. ప్రస్తుత వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో జడేజా 33 వికెట్లతో భారత్ తరఫున మూడో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడని గుర్తుచేశారు. హాగ్లీ ఓవల్ వంటి పిచ్‌లపై నాలుగో, ఐదో రోజు అతడి స్పిన్ బౌలింగ్ ఎంతో ఉపయోగపడేదని పేర్కొన్నారు. బంతిని గాల్లోకి ఎక్కువగా విసరకుండానే పిచ్‌పై పట్టించి తిప్పగల సామర్థ్యం జడేజాకు ఉందని తెలిపారు. సిరాజ్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కకపోవడం బాధాకరమని గవాస్కర్ అన్నారు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో సిరాజ్ కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడని గుర్తుచేశారు. అయితే జట్టు ఎంపికపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ.. తుది జట్టు ప్రకటించిన తర్వాత దానికి మద్దతు ఇవ్వడం తన విధానమని స్పష్టం చేశారు.