NTV Telugu Site icon

Mohammed Shami: షమీకి ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి.. భార్య హసీన్ జహాన్ ఆరోపణలు

Hasin Jahan Shami

Hasin Jahan Shami

Mohammed Shami Wife Moves Supreme Court To Lift Stay On Cricketers Arrest: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ప్రొఫెషనల్ లైఫ్ ఎంత సక్సెస్‌ఫుల్‌గా సాగుతుందో, వ్యక్తిగత జీవితంలో అన్నే ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. భార్య హసీన్ జహాన్‌తో అతనికి విభేదాలు ఉన్నాయి. తనపై గృహహింసకు పాల్పడుతున్నాడని, పరాయి మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడంటూ.. 2018లోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ కేసు పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆమె ఈ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. అతనిపై నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించిన విచారణలో ఎలాంటి పురోగతి లేదని, అతని అరెస్ట్ వారెంట్‌పై స్టేను ఎత్తివేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఇప్పటికీ షమీకి వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. అదనపు కట్నం కోసం తనని నిత్యం వేధించేవాడని కూడా వాపోయింది.

CSK vs LSG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న సీఎస్కే

కాగా.. తనపై గృహహింసకు పాల్పడుతున్నాడంటూ హసీన్ జహాన్ తన భర్త షమీపై 2018లో కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. షమీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ సమయంలో షమీని, అతని సోదరుడ్ని పిలిపించి.. కోల్‌కతా పోలీసు మహిళా ఫిర్యాదు విభాగం ప్రశ్నించింది. 2019 ఆగస్టులో.. కోల్‌కతాలోని అలిపోర్‌ కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ.. సెషన్స్‌ కోర్టుని ఆశ్రయించాడు. అప్పుడు అతని అరెస్టు వారెంట్‌, క్రిమినల్ విచారణ ప్రక్రియపై స్టే విధిస్తూ.. సెషన్స్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్టేని ఎత్తివేయాలని కోరుతూ.. ఈ ఏడాది మార్చిలో హసీన్‌ జహాన్ కోల్‌కతా హైకోర్టుని ఆశ్రయించగా, అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ.. ఆమె తాజాగా సుప్రీంకోర్టుకి వెళ్లింది. షమీపై కేసు నమోదైనా.. ఉద్దేశపూర్వకంగానే గత నాలుగేళ్లుగా విచారణపై స్టేను కొనసాగిస్తున్నారని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించింది. అంతేకాదు.. తనని తరచూ కట్నం కోసం వేధించేవాడని, అతనికి ఎంతోమంది ఎఫైర్లు ఉన్నాయని, బీసీసీఐ టూర్లకి వెళ్లినప్పుడు అతడు ఆ సంబంధాల్ని కొనసాగిస్తున్నాడని హసీన్ ఆరోపణలు గుప్పించింది.

Akhil Akkineni: నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో.. వీటికి దూరంగా వెళ్లిపో

కాగా.. 2014లో షమీ, హసీన్‌ జహాన్‌ల వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. గతంలో ఓసారి హసీన్ డ్రెస్సింగ్ సెన్స్‌పై విమర్శలు వచ్చినప్పుడు.. షమీ తన భార్యకు మద్దతు నిలుపుతూ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఈ వివాదం సద్దుమణిగిందని అనుకునేలోపే.. హసీన్ తన భర్తకు వివాహేతర సంబంధాలున్నాయంటూ కుండబద్దలు కొట్టింది. అప్పట్లో కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో లీక్ చేసింది. షమీపై గృహహింస కేసు నమోదు పెట్టినప్పుడు.. భరణం కింద ఆమె రూ.10 లక్షలివ్వాలని కోరింది. ఈ కేసుని విచారించిన కోల్‌కతా హైకోర్టు.. భార్య ఖర్చులకు రూ.50 వేలు, కుమార్తె పోషణ కోసం రూ.80 వేలు చొప్పున మొత్తం రూ.1.30 లక్షలు భరణం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.