NTV Telugu Site icon

Mithali Raj: రిటైర్మెంట్‌ తర్వాత ఆ పని చేయడానికి నేను సిద్ధంగా వున్నాను..

787377 781212 Mithali Raj Pti

787377 781212 Mithali Raj Pti

మహిళల క్రికెట్ లో ఆమె ఒక సచిన్ టెండూల్కర్ . ఇప్పుడున్న ప్రతీ మహిళా క్రికెటర్ కూడా ఆమెను చూసే క్రికెటర్ అవ్వాలని అనుకున్నారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో ఆమెకు తిరుగు లేదు. ఆమె మరెవరో కాదు దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ . అయితే తాజాగా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆమె .. అవకాశం వస్తే కచ్చితంగా క్రికెట్‌ పాలకురాలిగా మారతానని మిథాలీ రాజ్‌ అంటోంది. మహిళల క్రికెట్‌ గురించి వారికే ఎక్కువ తెలుస్తుందని పేర్కొంది. బెలిండా క్లార్క్‌, కానర్‌ తరహాలో తానూ రాణిస్తానని ధీమా వ్యక్తం చేసింది. రిటైర్మెంట్‌ తర్వాతి ప్రణాళికలను ఆమె వివరించింది.

బీసీసీఐ పాలక మండలిలో చేరడం తనకిష్టమేనని మిథాలీ తెలిపింది. వేర్వేరు దశల్లో మహిళల జట్టును నడిపించిన అనుభవం తనకుందని వివరించింది. అదే పాలకురాలిగా తనకు ఉపయోగపడుతుందని విశ్వాసంతో ఉంది.

‘అవును, పాలకురాలిగా మారడం నాకిష్టమే. అవకాశం వస్తే కచ్చితంగా చేపడతాను. మహిళా క్రికెటర్‌గా ఎంతో అనుభవం ఉంది. క్రీడాకారిణిగా ఎన్నో దశలను చూశాను. ఆ అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది’ అని మిథాలీ తెలిపింది.

‘మహిళల క్రికెట్‌ గురించి మహిళలే బాగా అర్థం చేసుకుంటారు. అందుకే బోర్డులో వారికి కచ్చితమైన ఓ పొజిషన్‌ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కొన్నేళ్లుగా వారు జట్టులో, క్రికెట్లో కొనసాగారు. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ను బెలిండా క్లార్క్‌ తన అనుభవంతో మెరుగుపరిచింది. ఈసీబీలో క్లేర్‌ కానార్‌ ఇదే దారి అనుసరించింది. అందుకే అమ్మాయిల క్రికెట్‌కు పరిపాలనలో మహిళలు మెరుగ్గా రాణించగలరని నా నమ్మకం’ అని మిథాలీ వివరించింది.

“మైదానంలోని అడుగు పెట్టిన ప్రతిసారీ నేను అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నించాను. భారత్‌ను గెలిపించేందుకే కష్టపడ్డాను. మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు ప్రయత్నించాను. ప్రస్తుతం జట్టు ప్రతిభావంతులైన యువ క్రికెటర్ల చేతుల్లో ఉంది. భారత మహిళల క్రికెట్‌ జట్టు భవిష్యత్తు బాగుంటుందని తెలుసు. అందుకే నా ప్రయాణం ముగించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాను’ అని మిథాలీ పేర్కొంది.

మహిళల క్రికెట్లో ఎవరెస్టు శిఖరం మిథాలీ రాజ్‌. కెరీర్లో ఆమె సాధించని రికార్డుల్లేవ్‌. అందుకోని ఘనతల్లేవ్‌. 23 ఏళ్లుగా అమ్మాయిల క్రికెట్‌కు సేవలందిస్తున్న ఈ టీమ్‌ఇండియా దిగ్గజం రెండు రోజుల క్రితమే వీడ్కోలు ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసింది. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్‌ పగ్గాలు ప్రతిభావంతుల చేతుల్లోనే ఉన్నాయని వెల్లడించింది. తనకు అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసింది.