Team India Lowest Powerplays Scores: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియాకు ఘోరమైన ఆరంభం దక్కింది. బే ఓవల్ వేదికగా 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. తొలి ఓవర్‌లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మాట్ హెన్రీ తన బౌలింగ్‌తో భారత టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముగ్గురినీ హెన్రీ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించాడు.
మాట్ హెన్రీ నిప్పులు చెరిగే బంతులతో టీమిండియాను దెబ్బకొట్టాడు. హెన్రీ దెబ్బకు భారత్ 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 26 పరుగులే చేసింది. 2018 తర్వాత వన్డేల్లో తొలి పది ఓవర్లలో భారత్ నమోదు చేసిన అత్యల్ప స్కోర్ల జాబితాలో ఇది రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 2019లో ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 21/3 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది. అదే ఏడాది న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 22/4, ప్రపంచ కప్‌లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన మ్యాచ్‌లో 24/4 స్కోర్లు నమోదు చేసింది.
2022లో దక్షిణాఫ్రికాతో లక్నోలో 24/2, 2019లో ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో 26/1 స్కోర్లు భారత్ సాధించింది. తాజాగా మౌంట్ మాంగనుయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 26/4తో ఈ జాబితాలో భారత్ మరోసారి చోటు దక్కించుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ మూడు సందర్భాల్లోనూ మాట్ హెన్రీ భారత బ్యాటర్లను మడతెట్టెశాడు. 2019లో వెల్లింగ్టన్ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 2/10, అదే ఏడాది ప్రపంచ కప్‌లో ఓల్డ్ ట్రాఫోర్డ్ మ్యాచ్‌లో 3/13 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో తొలి పది ఓవర్లలో 3/14తో భారత్‌ను దెబ్బతీశాడు. మూడు మ్యాచ్‌ల్లో తొలి పది ఓవర్లలో హెన్రీ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. 15 ఓవర్లలో 37 పరుగులిచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ రేటు కేవలం 2.46గా ఉంది. మొత్తంగా భారత బ్యాటింగ్‌పై హెన్రీకి ఉన్న పట్టు మరోసారి ఈ మ్యాచ్‌లో స్పష్టమైంది.
2018 నుంచి వన్డేల్లో భారత్ నమోదు చేసిన అత్యల్ప స్కోర్లు (మొదటి 10 ఓవర్లలో):
21/3 – ఆస్ట్రేలియాతో, సిడ్నీ, 2019
22/4 – న్యూజిలాండ్‌తో, వెల్లింగ్టన్, 2019 (మ్యాట్ హెన్రీ: 2/10)
24/4 – న్యూజిలాండ్‌తో, ఓల్డ్ ట్రాఫోర్డ్, ప్రపంచ కప్ 2019 (మ్యాట్ హెన్రీ: 3/13)
24/2 – దక్షిణాఫ్రికాతో, లక్నో, 2022
26/1 – ఆస్ట్రేలియాతో, మెల్‌బోర్న్, 2019
26/4 – న్యూజిలాండ్‌తో, మౌంట్ మాంగనుయ్, 2026 (మ్యాట్ హెన్రీ: 3/14)

