రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలపై విచారణ జరపడంతోపాటు రెజ్లింగ్ సమాఖ్యకు సంబంధించిన రోజువారీ వ్యవహారాలను చూసుకోవడం కోసం ఓ కమిటీని నియమించింది. నలుగురు సభ్యుల ఈ కమిటీని లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్ లీడ్ చేయనుంది. ఇక నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సమాఖ్య వ్యవహారాలతో ఎలాంటి సంబంధం ఉండబోదు. ఈ కమిటీలో మేరీ కోమ్‌తో పాటు రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ ప్లేయర్ తృప్తి మురుగుండె, రాజగోపాలన్ ఉన్నారు. ఈ కమిటీయే ఇక నుంచి రెజ్లింగ్ వ్యవహారాలు చూడనుంది.
డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌పై రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌తో పాటు పలువురు రెజ్లర్లు కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం ఈ ఫెడరేషన్ కార్యకలాపాలను రద్దు చేసింది. సోమవారం కమిటీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకుంది. అలాగే డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమార్‌ను కూడా సస్పెండ్ చేసింది.ఈ ఆరోపణలపై విచారణ జరుపుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో శనివారం రెజ్లర్లు తమ నిరసనను విరమించారు. తాను నిరసన విరమిస్తున్నట్లు రెజ్లర్ భజరంగ్ పూనియా చెప్పాడు. జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు దిగిన ఈ రెజ్లర్లను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా మాట్లాడారు. నాలుగు వారాల్లో దీనిపై విచారణ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఈ విచారణ పూర్తయ్యే వరకు డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్ బాధ్యతలకు భూషణ్ దూరంగా ఉండనున్నారు. సమాఖ్యతో ఆయనకు ఎలాంటి సంబంధం ఉండబోదు.