టీమిండియా మాజీ ఆటగాడు, స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్‌లో మార్చి 29వ తేదీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే సెహ్వాగ్ తన తొలి ట్రిపుల్ సెంచరీని సాధించింది ఈరోజే. ఈ ట్రిపుల్ సెంచరీ సెహ్వాగ్‌కే కాదు టీమిండియాకు కూడా తొలి ట్రిపుల్ సెంచరీ. పాకిస్థాన్‌లోని ముల్తాన్ వేదికగా మార్చి 29, 2004న ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఇదే రోజున మరో ట్రిపుల్ సెంచరీ మార్క్‌ను కూడా సెహ్వాగ్ అందుకోవడం విశేషం.
ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు ఇచ్చిన సెహ్వాగ్ మొత్తంగా 375 బంతులు ఎదుర్కొని 82 స్ట్రైక్‌రేట్‌తో 309 పరుగులు చేశాడు. సెహ్వాగ్ ఇన్నింగ్స్‌లో 39 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.
మరోవైపు మార్చి 29, 2008న చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ ఏకంగా 100 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 304 బంతులు ఎదుర్కొన్న సెహ్వాగ్ 104 స్ట్రైక్‌రేట్‌తో 319 పరుగులు చేశాడు. ఇందులో 42 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. దీంతో అప్పటివరకు తన పేరు మీదే ఉన్న అత్యధిక పరుగుల (309) రికార్డును సెహ్వాగ్ తనకు తానే 319 పరుగులు చేసి బద్దలు కొట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
