Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో అందరికీ తెలుసు. బౌలర్ ఎక్కువ పరుగులు ఇచ్చినా.. ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేసినా ధోనీ ఎప్పుడూ అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించదు. అందుకే ధోనీని అందరూ కెప్టెన్ కూల్ అని అభివర్ణిస్తారు. అయితే తనకు మైదానంలో ఎందుకు కోపం రాదో.. తన కూల్‌నెస్‌కు కారణాలేంటో తాజాగా ధోనీ వెల్లడించాడు. తాను మనిషినేనని.. తనకు కూడా కోపం వస్తుందని.. కానీ చివరి క్షణంలో తన భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తానని ఓ కంపెనీ ఈవెంట్‌లో మీడియా అడిగిన ప్రశ్నకు ధోనీ వివరించాడు. నిజాయితీగా చెప్పాలంటే.. తాము గ్రౌండ్‌లో ఉన్నప్పుడు.. మిస్ ఫీల్డింగ్, క్యాచ్‌లు వదిలివేయడం లేదా ఇతర తప్పులు చేయకూడదు అని భావిస్తామని ధోనీ తెలిపాడు.
Read Also:Death Certificate: నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. వైరల్ అవుతున్న పేపర్ ప్రకటన
అయితే ఆటగాడు ఎందుకు క్యాచ్ డ్రాప్ చేశాడో.. ఎందుకు తప్పుగా ఫీల్డింగ్ చేశాడో గుర్తించడానికి తాను ప్రయత్నిస్తానని ధోనీ వ్యాఖ్యానించాడు. వారి స్థానాల్లో ఉండి తాను ఆలోచిస్తానని… కోపం తెచ్చుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని గ్రహిస్తానని పేర్కొన్నాడు. తమను ఎంతో మంది ప్రేక్షకులు స్టాండ్‌లలో కూర్చుని ప్రత్యక్షంగా చూస్తుంటారని.. అంతేకాకుండా కోట్లాది మంది ప్రజలు మ్యాచ్‌ను టీవీల్లో చూస్తుంటారని.. తాను జాతీయ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నాననే విషయాన్ని నిరంతరం గుర్తుతెచ్చుకుంటూ భావోద్వేగాలను నియంత్రించుకుంటానని ధోనీ వివరించాడు. అయితే ఫీల్డర్ తప్పుకు కారణమేమిటో తప్పకుండా తర్వాత తెలుసుకుంటానని తెలిపాడు.
ఓ ఆటగాడు 100 శాతం అంకితభావంతో ఆడుతూ ఓ క్యాచ్ వదిలేస్తే అదేమంత సమస్యగా తాను భావించనని ధోనీ స్పష్టం చేశాడు. ప్రాక్టీస్ సందర్భంగా సదరు ఆటగాడు ఎన్ని క్యాచ్‌లు పట్టాడన్నది ఆలోచిస్తానని, క్యాచింగ్‌లో ఏదైనా సమస్య ఉంటే దాన్ని అధిగమించడానికి అతడు ప్రయత్నం చేశాడా లేదా అనేది గమనిస్తానని చెప్పాడు. తనకు కూడా అందరిలాగే భావోద్వేగాలు ఉంటాయని.. కానీ బయట కూర్చుని, ఇలా ఆడాలి, అలా ఆడాలి అని చాలా మంది చెబుతుంటారని.. కానీ మైదానంలో దిగిన తర్వాత అంచనాలకు తగినట్టుగా ఆడడం ఎంతో కష్టమని ధోనీ పేర్కొన్నాడు.
