భారత్ పర్యటనలో (గోట్ ఇండియా టూర్) భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీకి భారత్, యూఎస్ఏ టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ టికెట్లను ఐసీసీ చైర్మన్ జై షా అందజేశారు. అంతేకాదు భారత క్రికెట్ జట్టు జెర్సీ, బ్యాట్‌ను కూడా బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా పాల్గొన్నారు.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ 2026 జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో యూఎస్ఏను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రావాలని లియోనెల్ మెస్సిని జై షా కోరారు. ఈ మేరకు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్‌ను అందించారు. మెస్సీకి ప్రత్యేక గౌరవంగా ఫ్రేమ్ చేసిన క్రికెట్ బ్యాట్, టీమిండియా జెర్సీని అందించారు. మెస్సీతో పాటు వచ్చిన అతని సహచరులు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్కు కూడా జ్ఞాపికలు అందజేశారు.
Also Read: IPL 2026 Auction: పవర్ హిట్టర్‌పై కన్నేసిన ఆర్సీబీ.. 8 మందిలో ఇద్దరు విదేశీలకు ఛాన్స్!
స్టేడియంలో లియోనెల్ మెస్సీ పేరు మార్మోగిపోయింది. అభిమానుల కేకలకు మెస్సీ భావోద్వేగం చెందారు. అభిమానుల ప్రేమపై స్పందిస్తూ.. ‘భారత్‌లో మాపై మీరు చూపిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం. ఈ పర్యటన చాలా తక్కువ కాలం అయినప్పటికీ ఎంతో మధురానుభూతిని ఇచ్చింది. భారత్‌లో ప్రేమ ఉంటుందని నాకు తెలుసు కానీ.. ప్రత్యక్షంగా అనుభవించడం అద్భుతంగా ఉంది. మీ ప్రేమకు మరోసారి ధన్యవాదాలు. మేము తప్పకుండా మళ్లీ వస్తాం. మ్యాచ్ ఆడేందుకు కావొచ్చు లేదా ఇంకే సందర్భంలో అయినా సరే కానీ భారత్‌కు మళ్లీ రావడం మాత్రం ఖాయం’ అని మెస్సీ అన్నారు.
