Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!

  • వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ ఆడని కుల్దీప్ యాదవ్
  • జట్టులో చోటు దక్కకపోవడంతో కుల్దీప్ కీలక నిర్ణయం
  • కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు సిద్దమైన కుల్దీప్
Kuldeep Yadav, Yorkshire, County Cricket

Kuldeep Yadav, Yorkshire, County Cricket

Kuldeep Yadav signs for Yorkshire inCounty Cricket 2026: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ప్రముఖ కౌంటీ క్రికెట్ క్లబ్ యార్క్‌షైర్‌తో కుల్దీప్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సీజన్‌లో యార్క్‌షైర్‌ జట్టుకు కీలక సేవలు అందించనున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో చోటు దక్కకపోవడం, జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా ఎంపిక కాకపోవడంతో కుల్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఈ సీజన్‌లో యార్క్‌షైర్ తరఫున కుల్దీప్ యాదవ్ మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఇందులో ఐదు వన్డే కప్ (మెట్రో బ్యాంక్ వన్‌డే కప్) మ్యాచ్‌లతో పాటు సెప్టెంబర్‌లో జరిగే కౌంటీ ఛాంపియన్‌షిప్ చివరి నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో బరిలోకి దిగనున్నాడు. ఈ శుక్రవారం గ్లామోర్గన్‌తో నీథ్ వేదికగా జరిగే 50 ఓవర్ల మ్యాచ్‌లో యార్క్‌షైర్ తరఫున కుల్దీప్ అరంగేట్రం చేయనున్నాడు. ప్రస్తుతం కుల్దీప్ ఇంగ్లీష్ గడ్డపైనే ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 1-2తో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ వన్డే సిరీస్‌లో కుల్దీప్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. చివరి వన్డేలో జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా స్పిన్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా.. పేస్ బౌలర్లతోనే బరిలోకి దిగిన టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు. ఆ మ్యాచ్‌లో భారత్ ముందుగా బౌలింగ్ చేసి 387 పరుగులు సమర్పించుకుని.. చివరకు 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కుల్దీప్‌ను పక్కన పెట్టడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇక జింబాబ్వే టీ20 సిరీస్‌కు కూడా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినా.. కుల్దీప్‌కు అవకాశం రాకపోవడంతో, మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కౌంటీ క్రికెట్ ఆడాలని అతడు నిర్ణయించుకున్నాడు. శ్రీలంకతో ఆగస్టులో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు తన రిథమ్‌ను కొనసాగించేందుకు ఈ కౌంటీ అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నాడు. శ్రీలంక సిరీస్ అనంతరం మళ్లీ యార్క్‌షైర్ జట్టుతో కలిసి కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. యార్క్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం కుల్దీప్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘యార్క్‌షైర్ వంటి గొప్ప చరిత్ర కలిగిన క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఇంగ్లండ్ పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం ఎప్పుడూ నాకు సవాలే. జట్టు యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత ఈ అవకాశంపై మరింత ఉత్సాహం కలిగింది. హెడ్డింగ్‌లేలో జట్టుకు నా వంతు సహకారం అందించేందుకు ఎదురుచూస్తున్నాను’ అని చెప్పాడు.

యార్క్‌షైర్ క్రికెట్ జనరల్ మేనేజర్ గావిన్ హామిల్టన్ కూడా కుల్దీప్ రాకపై సంతోషం వ్యక్తం చేశాడు. ‘కుల్దీప్ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకున్న ప్రపంచ స్థాయి స్పిన్నర్. ఈ వేసవిలో ఇంగ్లండ్‌లో పొడి వాతావరణం నెలకొనడంతో సీజన్ చివరి దశలో స్పిన్ కీలక పాత్ర పోషించనుంది. అతని లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ మా బౌలింగ్ దళానికి కొత్త బలాన్ని అందిస్తుంది. అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని హామిల్టన్ వెల్లడించాడు. కుల్దీప్ ఇప్పటివరకు భారత తరఫున 18 టెస్టుల్లో 79 వికెట్లు, 121 వన్డేల్లో 194 వికెట్లు, 54 టీ20ల్లో 95 వికెట్స్ పడగొట్టాడు.