NTV Telugu Site icon

India vs Bangladesh: కేఎల్ రాహుల్ అలా.. సుందర్ ఇలా.. దొందు దొందే!

Kl Rahul Sundar Dropped

Kl Rahul Sundar Dropped

KL Rahul Washington Sundar Dropped Two Catches: బంగ్లాదేశ్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. గెలుపు అంచులదాకా వెళ్లి, భారత్ ఈ మ్యాచ్‌ని చేజేతులా పోగొట్టుకుంది. ఈ మ్యాచ్ ఓడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. కానీ.. ఫీల్డర్లు చేసిన ఘోర తప్పిదాలు, బంగ్లాకి వరాలుగా మారాయి. చివర్లో రెండు సాధారణమైన క్యాచ్‌లను మిస్ చేయడం వల్ల, భారత్ భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది.

మొదటి తప్పు: అప్పుడు బంగ్లాదేశ్ స్కోరు 155/9గా ఉంది. లక్ష్యానికి బంగ్లా జట్టు ఇంకా 32 పరుగుల దూరంలో ఉంది. అది 43వ ఓవర్. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ వేస్తున్నాడు. ఆ ఓవర్‌లోని మూడో బంతికి మెహదీ భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అప్పుడు బంతి బ్యాట్ ఎడ్జ్‌కి తగిలి పైకి ఎగిరింది. దాన్ని క్యాచ్‌గా అందుకునేందుకు కేఎల్ రాహుల్ ప్రయత్నించాడు. అతని చేతిలోకి ఆ బంతి వచ్చి పడింది కూడా! కానీ, రాహుల్ సునాయాసంగా అందిన ఆ క్యాచ్‌ని జారవిడిచాడు. అతని చేతిలో నుంచి బౌన్స్ అయి, ఆ బంతి కిందకు పడింది. దీంతో, మెహదీకి ఒక లైఫ్ వచ్చింది.

రెండో తప్పు: తనకు లైఫ్ వచ్చిన ఆనందంలో.. మెహదీ ఇకపై చెలరేగాలని ఫిక్సైపోయాడు. ఆ తర్వాతి బంతికి మళ్లీ భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. ఈసారి కూడా పైకి ఎగిరిన ఆ బంతి, థర్డ్ మ్యాన్ వైపు వెళ్లింది. చాలాసేపు గాల్లోనే ఉంది. అయితే, థర్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉన్న వాషింగ్టన్ సుందర్, కనీసం క్యాచ్ పట్టే ప్రయత్నం కూడా చేయలేదు. బంతి అతని కంటికి కనిపించలేదో, లేక బద్ధకమో తెలీదు కానీ, సుందర్ క్యాచ్ పట్టకపోవడంతో కెప్టెన్ రోహిత్ తీవ్ర కోపాద్రిక్తుడయ్యాడు. ఒకవేళ అతడు ప్రయత్నించి ఉంటే, కచ్ఛితంగా బంతి అతని చేతికి చిక్కేది.

ఇలా ఈ రెండు తప్పిదాల కారణంగా మెహదీకి కలిసొచ్చింది. అతడు ముస్తాఫిజుర్‌తో కలిసి.. వీరోచితంగా పోరాడాడు. అప్పటివరకు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసిన భారత బౌలర్లు కూడా చివర్లో పరుగులు సమర్పించుకోవడంతో.. బంగ్లాదేశ్ చారిత్రక విజయం సాధించింది. మరోవైపు.. ఆ ఇద్దరు వదిలిపెట్టిన క్యాచ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో.. భారత క్రీడాభిమానులు వారిని ఏకిపారేస్తున్నారు.