యాషెస్ టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మరో ఘనత సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో అతడు ఈ ఘనతలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను అధిగమించాడు. అయితే శనివారం అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో యాషెస్ టెస్టులో రూట్ 3వ రోజు ఈ ఫీట్ సాధించాడు. 2008లో దక్షిణాఫ్రికా ఆటగాడు గ్రేమ్ స్మిత్ తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1,600 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి ఆటగాడు రూట్.
ప్రస్తుతం ఈ ఏడాది రూట్ ఇప్పటివరకు 64.24 సగటుతో 1,606 పరుగులు చేశాడు. కేవలం 14 టెస్టులలో ఈ ఘనత అందుకున్నాడు. రూట్ ఈ ఏడాది అత్యధికంగా ఇండియా పైన 228 చేయగా… మొత్తం ఆరు సెంచరీలు చేశాడు. అయితే పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ యూసుఫ్ ఒకే క్యాలండర్ ఇయర్‌లో అత్యధికంగా 1788 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ (1976లో 1,710 పరుగులు), దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (2008లో 1,656 పరుగులు) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక సచిన్ ఈ రికార్డ్ లో (2010లో 1562 పరుగులు) 6వ స్థానంలో ఉన్నాడు.