Site icon NTV Telugu

Jimmy Neesham: నో బాల్ వివాదం.. కివీస్ ఆల్‌రౌండర్ సెటైర్

Jimmy Neesham No Ball

Jimmy Neesham No Ball

Jimmy Neesham Funny Comments On No Ball Controversy: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో భాగంగా చివరి ఓవర్‌లో మహ్మద్ నవాజ్ వేసిన నో బాల్‌పై క్రికెట్ ప్రపంచంలో తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే! మ్యాచ్ ముగిసినప్పటి నుంచి ఆ నో బాల్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది నో బాల్ కాదని పాకిస్తాన్ అభిమానులతో పాటు మాజీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. విదేశీ ఆటగాళ్లు కూడా దానిపై రివ్యూ తీసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం.. ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని వాదిస్తున్నారు. అయితే.. న్యూజీల్యాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ మాత్రం ఈ నోబాల్‌ అంశంపై ఫన్నీ కామెంట్‌ చేశాడు. అలాగే.. నడుము ఎత్తులో వచ్చే ఈ నో బాల్‌ను ఎలా నిర్ధారించాలో కూడా ఓ సరదా సూచన ఇచ్చాడు.

‘‘మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందు.. ప్రతీ ఆటగాడి నడుము ఎత్తును కొలవాలి. అలా చేస్తే.. ఫుల్‌టాస్‌ బంతి ఆ మార్కు కంటే తక్కువ ఎత్తులో వచ్చిందా, లేక ఎక్కువ ఎత్తులో వచ్చిందా? అనే విషయాన్ని మనకు హాక్‌ఐ తెలియజేస్తుంది’’ అంటూ నీషమ్ ట్వీట్ చేస్తూ.. నవ్వుతున్న ఎమోజీని ఆ ట్వీట్‌కి జత చేశాడు. ఈ కామెంట్‌పై కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇది కామెడీగా ఉందా? అంటూ కొందరు ఫైర్ అవుతుంటే, మంచి సూచనే ఇచ్చావంటూ మరికొందరు నవ్వుకుంటున్నారు. ఏదేమైనా.. ఈ నో బాల్ పుణ్యమా అని భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఆ బంతిని కోహ్లీ సిక్స్‌గా మలచడం, ఫ్రీ హిట్ రావడంతో అతడు బౌల్డ్ అయినా ఔట్ కాకపోవడం వంటివి భారత్‌కి కలిసొచ్చాయి. ఫలితంగా.. అసాధ్యం అనుకున్న గెలుపుని భారత్ చేజిక్కించుకుంది.

Exit mobile version