Tom Latham Record: బుమ్రా దెబ్బ.. కివీస్ కెప్టెన్ ఖాతాలో చెత్త రికార్డు.. సెహ్వాగ్‌ను దాటేశాడు!

Jasprit Bumrah, Tom Latham

Jasprit Bumrah, Tom Latham

Tom Latham Duck Record: వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్‌ చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే లాథమ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి.. లాథమ్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. మొదటి ఇన్నింగ్స్‌లోనూ లాథమ్‌ను బుమ్రా డకౌట్ చేశాడు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నాకే ఔటైన లాథమ్‌.. ‘పెయిర్’ నమోదు చేశాడు.

ఈ క్రమంలో టామ్ లాథమ్ టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్ల జాబితాలో చేరాడు. ఇప్పటివరకు 16 సార్లు ఓపెనర్‌గా డకౌట్ అయ్యాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆటగాడు క్రెయిగ్ బ్రాత్‌వైట్ 19 డకౌట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైక్ అథర్టన్ 17 డకౌట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మార్వన్ ఆటపట్టు, టామ్ లాథమ్ చెరో 16 డకౌట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15 డకౌట్లతో ఈ జాబితాలో ఉన్నాడు. ఈ మ్యాచ్ ముందు వరకు వీరూ తర్వాతి స్థానంలో ఉన్న లాథమ్‌.. రెండు డకౌట్‌లతో ముందుకు దూసుకెళ్లాడు.

మరోవైపు న్యూజిలాండ్ కెప్టెన్లలో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ కావడం కూడా అరుదైన ఘటనగా నిలిచింది. గతంలో హ్యారీ కేవ్ 1956లో వెస్టిండీస్‌పై, స్టీఫెన్ ఫ్లెమింగ్ 1997లో ఆస్ట్రేలియాపై ఈ విధంగా పెయిర్ నమోదు చేశారు. ఇప్పుడు 2026లో భారత్‌తో జరుగుతున్న వెల్లింగ్టన్ టెస్టులో టామ్ లాథమ్ ఈ జాబితాలో చేరాడు. అంతేకాకుండా న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి పెయిర్ నమోదు చేసిన ఎనిమిదో ఆటగాడిగా లాథమ్ నిలిచాడు. భారత్‌పై ఈ ఘనత సాధించిన రెండో న్యూజిలాండ్ ఓపెనర్‌గా కూడా నిలిచాడు. గతంలో 2010లో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టులో టిమ్ మెకింతోష్ భారత్‌పై పెయిర్ నమోదు చేశాడు.

టెస్టుల్లో ఓపెనర్‌గా అత్యధిక డకౌట్ల ప్లేయర్స్ లిస్ట్:
క్రెయిగ్ బ్రాత్‌వైట్ – 19
మైక్ అథర్టన్ – 17
మార్వన్ ఆటపట్టు – 16
టామ్ లాథమ్ – 16
వీరేంద్ర సెహ్వాగ్ – 15