T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ ఈ హ్యాట్రిక్ సాధించడం విశేషం. టీ20ల్లో అగ్రశ్రేణి జట్టు న్యూజిలాండ్‌పై పసికూన ఐర్లాండ్ జట్టు హ్యాట్రిక్ నమోదు చేయడం నిజంగా అద్భుతమే అని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయగా 19వ ఓవర్‌లో జోష్ లిటిల్ బౌలింగ్‌కు దిగి వరుస బంతుల్లో కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్‌లను అవుట్ చేశాడు. ముందుగా 19వ ఓవర్ రెండో బంతికి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. మిడిల్ స్టంప్ మీద పడి ఇన్ స్వింగ్ అయిన బంతిని విలియమ్సన్ డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా షాట్ ఆడాడు. అయితే గాల్లోకి లేచిన ఆ బంతి నేరుగా డెలానీ చేతుల్లో వాలింది.
Read Also: T20 World Cup: సెమీస్‌కు వెళ్లిన తొలి జట్టుగా న్యూజిలాండ్
అటు అదే ఓవర్ మూడో బంతికి జేమ్స్ నీషమ్ అవుట్ అయ్యాడు. లెగ్ స్టంప్‌పై పిచ్ అయిన బంతిని నీషమ్ ఆడలేకపోయాడు. బంతి నేరుగా ప్యాడ్స్‌ను తాకింది. దీంతో అతడు ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో బంతికి శాంట్నర్ కూడా అదే తరహాలో అవుటయ్యాడు. దీంతో ఈ టోర్నీలో రెండో హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా జోష్ లిటిల్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికే శ్రీలంకపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బౌలర్ కార్తీక్ మయప్పన్ తొలి హ్యాట్రిక్ సాధించాడు. కాగా ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఐదుగురు బౌలర్లు హ్యాట్రిక్ తీశారు. 2007లో ఆరంభ టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్ లీ బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో హ్యాట్రిక్ 2021లో నమోదైంది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌పై ఐర్లాండ్ బౌలర్ క్యాంఫర్ ఈ ఘనత సాధించాడు. ఇదే టోర్నీలో శ్రీలంక బౌలర్ హసరంగ కూడా హ్యాట్రిక్ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాపై హసరంగ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి.
