ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చంఢీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్లో యజువేంద్ర చాహల్ సరికొత్త రికార్డును సృష్టించబోతున్నాడు. పంజాబ్ తో జరిగే మ్యాచ్లో చాహల్ 3 వికెట్లు పడగొడితే ఐపీఎల్ చరిత్రలోనే 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు.
ఐపీఎల్లో చాహల్ ఇప్పటి వరకు 157 మ్యాచ్‌లు ఆడాడు. అందులో మొత్తం 197 వికెట్లు తీశాడు. అతను 2011లో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్‌తో తరుఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత.. 2014 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చాలా సీజన్లు ఆడాడు. 2022 మెగా వేలానికి ముందు ఆర్సీబీ.. చాహల్ వదిలేసింది. ఈ క్రమంలో వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు తీశాడు.
మరోవైపు.. చాహల్కు పంజాబ్ కింగ్స్పై మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఆ టీమ్ తో 19 మ్యాచ్‌లు ఆడిన చహల్ 29 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్ లో తానేంటో నిరూపించుకుని.. టీ20 ప్రపంచకప్-2024 ఆడే టీమిండియాలో చోటు దక్కించుకోవాలని చహల్ పట్టుదలగా ఉన్నాడు. ఇకపోతే.. ఈ సీజన్ లో తొలి ఓటమిపాలైన రాజస్థాన్.. పంజాబ్ తో జరిగే మ్యాచ్ లో ఎలాగైనా తిరిగి విజయాన్ని పొందాలని కసితో ఉంది. అటు.. వరుస ఓటములతో మూలుగుతున్న పంజాబ్.. హోంగ్రౌండ్ లో గెలవాలని ఉవ్విళూర్లుతోంది.
