NTV Telugu Site icon

Dinesh Karthik-Virat Kohli: థ్యాంక్యూ డీకే.. ఎప్పటికీ నీకు రుణపడి ఉంటా: కోహ్లీ

Dinesh Karthik Virat Kohli

Dinesh Karthik Virat Kohli

Virat Kohli Hails Dinesh Karthik: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్‌ ఎలిమినేటర్ మ్యాచ్‌ అనంతరం డీకే రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. కార్తిక్‌ను ఓదార్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా డీకేతో తనకున్న అనుబంధంపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తొలిసారి డీకేను కలిసిన సందర్భంగా ఇంకా గుర్తుందన్నాడు. సమస్యను ఎలా అధిగమించాలనేదానిపై అవగాహన కల్పించాడని, ఆ అమూల్యమైన సలహాకు ఎప్పటికీ రుణపడి ఉంటా అని విరాట్ పేర్కొన్నాడు.

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘నేను తొలిసారి దినేష్ కార్తిక్‌ను కలిసిన సందర్భంగా ఇంకా గుర్తుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఇద్దరం ఆడాం. 2009 ఛాంపియన్స్‌ ట్రోఫీ అది. డీకేతో కలిసి మొదటిసారి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నా. ‘కార్తీక్ చాలా సరదాగా ఉంటాడు. అయితే హైపర్‌ యాక్టివ్‌. కన్‌ఫ్యూజ్డ్‌ పర్సన్ కూడా. ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు’ డీకేపై నాకు కలిగిన తొలి ఇంప్రెషన్‌ ఇదే. డీకే అద్భుతమైన ప్రతిభావంతుడు. అప్పటికీ ఇప్పటికీ అతడిలో ఏ మార్పులేదు. మైదానం వెలుపల అతడి సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. చాలా విషయాలపై మంచి నాలెడ్జ్‌ ఉంటుంది. క్రికెటేతర అంశాల గురించీ చెబుతాడు’ అని తెలిపాడు.

Also Read: BCCI-India Coach: ఆస్ట్రేలియా మాజీలకు కౌంటర్.. టీమిండియా కొత్త కోచ్‌పై జై షా హింట్!

‘ఐపీఎల్ 2022 సీజన్‌ నాకు గొప్పగా ఏమీ లేదు. ఆత్మవిశ్వాసం విషయంలో చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు డీకే నా పక్కనే కూర్చొని నా సమస్యను వివరించాడు. దాన్ని ఎలా అధిగమించాలనేదానిపై సూచన ఇచ్చాడు. థ్యాంక్యూ డీకే.. నీ సలహాలతో మెరుగ్గా రాణించగలుగుతున్నా. నీకు ఎప్పటికీ అతడికి రుణపడి ఉంటా’ అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో డీకే 15 మ్యాచుల్లో 326 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌ 2024లో చోటు దక్కించుకోవడంలో కుర్రాళ్లకు పోటీదారుగా నిలిచిన డీకే.. వయసురీత్యా అవకాశం అందుకోలేకపోయాడు. 38 ఏళ్ల డీకే ఇప్పటివరకు భారత్‌ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడాడు.

 

 

Show comments