Vaibhav Sooryavanshi: వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు ప్రత్యర్థి ఓనర్ కూడా ఫిదా.. బుడ్డోడి కోసం వచ్చే ఏడాది బిడ్ ఖాయం!

  • యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్‌
  • 38 బంతుల్లోనే 93 పరుగులు చేసిన వైభవ్
  • బుడ్డోడి కోసం వచ్చే ఏడాది బిడ్ ఖాయం
Sanjiv Goenka Vaibhav

Sanjiv Goenka Vaibhav

LSG owner Sanjiv Goenka applauded Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన దూకుడైన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మంగళవారం జైపూర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి రాజస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ప్లేఆఫ్స్ రేసులో కీలకమైన ఈ మ్యాచ్‌లో వైభవ్ ఆడిన విధానం చూసి.. స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ప్రత్యర్థి జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కూడా యువ బ్యాటర్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయ్యారు.

వైభవ్ సూర్యవంశీ సెంచరీని తృటిలో మిస్ అయినా.. అతడు ఆడిన విధానం అభిమానులను ఉర్రూతలూగించింది. 10 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో లక్నో బౌలర్లపై బుడ్డోడు విరుచుకుపడ్డాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా స్వయంగా మైదానంలోకి వచ్చి వైభవ్‌తో మాట్లాడారు. బాగా ఆడావ్ అంటూ అభినందించారు. కొద్దిసేపటికే గోయెంకా సతీమణి అక్కడికి వచ్చారు. ఆమెను పరిచయం చేస్తుండగా.. వైభవ్‌ వెంటనే ఆమె పాదాలకు నమస్కరించాడు. చిన్న వయసులోనే అతడు చూపించిన సంస్కారం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మ్యాచ్ అనంతరం భారత దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సంజీవ్ గోయెంకా త్వరలోనే ఈ కుర్రాడి కోసం బిడ్ వేయబోతున్నాడేమో’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వైభవ్ బ్యాటింగ్ చూసి ప్రత్యర్థి జట్లు కూడా అభిమానులుగా మారిపోతున్నాయని సన్నీ అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో తొలుత కొంత సమయం తీసుకుని ఆడిన వైభవ్.. తర్వాత పూర్తిగా గేర్ మార్చాడు. వైభవ్‌కు ధ్రువ్ జురెల్ అద్భుత సహకారం అందించాడు. జురెల్ 38 బంతుల్లో 53 పరుగులు చేసి మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పాడు. ఇద్దరూ కలిసి లక్నో బౌలర్లను చితక్కొట్టడంతో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 19.1 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ ప్లేఆఫ్స్ ఆశలను మరింత బలపరుచుకుంది.