Uppal Stadium Power Cut News: ఉప్పల్ స్టేడియంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించని కారణంగా.. విద్యుత్‌శాఖ అధికారులు గురువారం (ఏప్రిల్ 4) స్టేడియంలో కరెంట్ నిలిపివేశారు. కరెంట్ నిలిపివేయడంతో ఒక్కసారిగా స్టేడియం అంధకారంలో చిక్కుకుంది. జనరేటర్ల సహాయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో అసలు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానాలు చెలరేగాయి.
అయితే ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ యధావిధిగా సాగుతుందని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. స్టేడియానికి కరెంట్ తిప్పలు తాత్కాలికంగా తప్పాయని చెప్పారు. క్రికెట్ అభిమానులు నిరుత్సాహం చెందవద్దన్న కారణంతో.. బకాయిల చెల్లింపులకు ఒక రోజు అదనపు సమయం ఇచ్చినట్లు విద్యుత్‌శాఖ పేర్కొంది. దాంతో నేటి రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఎలాంటి అంతరాయాలు లేకుండా జరగనుంది.