Site icon NTV Telugu

Kohli-Gavaskar: జట్టు కోరుకుంటోంది ఇది కాదు.. కోహ్లీపై గవాస్కర్ విమర్శలు!

Virat Kohli

Virat Kohli

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదు చేసిన సన్‌రైజర్స్‌ను.. దాని సొంతగడ్డ హైదరాబాద్‌లో ఆర్సీబీ గెలిచింది. 207 పరుగుల లక్ష ఛేదనలో సన్‌రైజర్స్‌ను 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులకే పరిమితం చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ టాప్‌ స్కోరర్‌ (51). అయినా కూడా విరాట్ స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విరాట్‌ కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ స్ట్రైక్‌ రేట్‌ 118 మాత్రమే. దాంతో విరాట్‌ ఆటతీరుపై టీమిండియా మాజీ దిగ్గజం సునీల్‌ గవాస్కర్ విమర్శలు చేశారు. విరాట్ కొట్టిన హాఫ్‌ సెంచరీ ఎంతో విలువైనదే అయినా.. అతడి ఇన్నింగ్స్‌ చాలా నెమ్మదిగా సాగిందన్నారు. జట్టు అతడి నుంచి కోరుకుంటోంది ఇది కాదు అని మండిపడ్డారు. హైదరాబాద్‌, బెంగళూరు మ్యాచ్‌లో వ్యాఖ్యాతగా ఉన్న సన్నీ.. ఈ వ్యాఖ్యలు చేశాడు.

Also Read: Rahul Dravid: క్యూలైన్‌లో నిల్చొని ఓటేసిన టీమిండియా కోచ్.. వీడియో వైరల్!

‘విరాట్ కోహ్లీ కేవలం సింగిల్స్ మాత్రమే తీశాడు. దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్ ఇంకా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కాబట్టి విరాట్ కొన్ని రిస్క్ షాట్లను ప్రయత్నించాలి. రజత్ పాటిదార్‌ను చూడండి. ఓ ఓవర్‌లో అప్పటికే మూడు సిక్సర్లు బాదాడు. కావాలనుకుంటే అతను సింగిల్ తీయగలడు. కానీ అతడు అలా చేయలేదు. మరో భారీ షాట్ ఆడాడు. ఆ సమయంలో బెంగళూరుకు కావాల్సింది అదే. కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు కానీ.. మధ్యలో లయ కోల్పోయినట్లు కనిపించింది. 31 పరుగుల నుంచి ఔట్‌ అయ్యే వరకూ ఒక్క బౌండరీ కొట్టలేదు. అతడి స్ట్రైక్‌ రేట్‌ 118. జట్టు విరాట్ నుంచి కోరుకుంటోంది ఇది కాదు. కోహ్లీ పెద్ద షాట్లను ప్రయత్నించాలి’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version