Shahbaz Ahmed Said Iam feeling proud got the Man of the Match: కీలక మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ తెలిపాడు. ఈ రాత్రికి కేవలం కేవలం రిలాక్స్ అవుతామని, ఐపీఎల్ 2024 ఫైనల్‌లో గెలిచి భారీగా సెలబ్రేషన్స్ చేసుకొంటామన్నాడు. మ్యాచ్ పరిస్థితిని బట్టి తనను రంగంలోకి దింపుతామని ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్, కోచ్ ముందే చెప్పారని షాబాజ్ పేర్కొన్నాడు. శుక్రవారం చెపాక్ మైదానంలో జరిగిన క్వాలిఫయర్-2లో 36 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించిన ఎస్‌ఆర్‌హెచ్.. ఐపీఎల్ 2024 ఫైనల్లో అడుగుపెట్టింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో షాబాజ్ అహ్మద్ కీలక పాత్ర పోషించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి విలువైన 18 పరుగులు సాధించాడు. హెన్రిచ్ క్లాసెన్‌కు అతడు మంచి సహకారం అందించాడు. షాబాజ్ అండతో క్లాసెన్ హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం బౌలింగ్‌లో రెచ్చిపోయాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులే ఇచ్చి.. కీలక వికెట్స్ పడగొట్టాడు. డేంజరస్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్‌తో పాటు ఆర్ అశ్విన్‌ను ఔట్ చేశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గాను షాబాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
Also Read: T20 World Cup 2024: జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లకు చోటు!
మ్యాచ్ అనంతరం షాబాజ్ అహ్మద్ మాట్లాడుతూ… ‘మ్యాచ్‌కు ముందు మా కెప్టెన్, మా కోచ్ నాతో మాట్లాడారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి నన్ను ఆడిస్తామని చెప్పారు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. బ్యాటింగ్ లైనప్ కుప్పకూలినప్పుడు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నేను క్రీజ్‌లోకి వచ్చాక అవేశ్ ఖాన్, సందీప్ శర్మ బౌలింగ్ చూసి.. పిచ్ మ్యాజిక్ చేసేలా ఉందనిపించింది. కీలక మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి.. అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం జట్టులో వాతావరణం బాగుంది. ఇప్పుడే మేం సంబరాలు చేసుకోం. ఫైనల్‌లో గెలిచి భారీగా సెలబ్రేషన్స్ చేసుకొంటాం. ఈ రాత్రి రిలాక్స్ అవుతాం. ముందుంది అసలు మ్యాచ్’ అని అన్నాడు.