NTV Telugu Site icon

SRH vs RCB: జోరు మీదున్న సన్‌రైజర్స్‌ను బెంగళూరు ఆపగలదా?.. 300 స్కోరుతో ఎస్‌ఆర్‌హెచ్ చరిత్ర సృష్టిస్తుందా?

Srh Ipl 2024

Srh Ipl 2024

SRH Look To Score 300 vs RCB: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 7 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌లలో గెలిచింది. ఆర్‌సీబీపై గెలిచి ప్లే ఆఫ్‌కు మరింత చేరువ కావాలని ఎస్‌ఆర్‌హెచ్ చూస్తోంది. మరోవైపు ఆర్‌సీబీ ఆడిన 8 మ్యాచ్‌లలో ఒకటే గెలిచి ప్లే ఆఫ్‌ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. వరుస ఓటములతో సతమతం అవుతున్న ఆర్‌సీబీ.. జోరుమీద సన్‌రైజర్స్‌ను ఆపగలదా? అన్నది చూడాలి.

గతంలో ఎన్నడూ లేని విధంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్ భీకరంగా ఉంది. ట్రావిస్ హెడ్‌, అభిషేక్‌ శర్మ దంచుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. పవర్‌ ప్లేలో బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఓపెనర్లు ఇచ్చిన ఆరంభాన్ని కొనసాగిస్తూ మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్‌, నితీశ్‌ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలెరేగుతున్నారు. ఐడెన్ మార్‌క్రమ్‌, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ విలువైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. మరోవైపు పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రాణిస్తున్నారు.

ఐపీఎల్ 2024లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంటే.. రికార్డుల మోతతో స్టేడియాలు హోరెత్తుతున్నాయి. ఇప్పటికే 277/3, 287/3, 125/0 (పవర్‌ ప్లే) రికార్డులు సృష్టించిన సన్‌రైజర్స్‌.. నేడు కూడా రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. సరిగ్గా 10 రోజుల క్రితం బెంగళూరుపై అత్యధిక స్కోరు (287)తో అదరగొట్టిన సన్‌రైజర్స్‌.. ఈరోజు 300 స్కోరుతో చరిత్ర సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సొంత మైదానం (ఉప్పల్‌ స్టేడియం) కావడం కూడా ఎస్‌ఆర్‌హెచ్‌కు కలిసొచ్చే అంశం.

Also Read: Mohit Sharma Record: సన్‌రైజర్స్‌ బౌలర్‌ రికార్డు బద్దలు.. ఐపీఎల్‌లో మోహిత్‌ శర్మ చెత్త రికార్డు!

మరోవైపు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆర్‌సీబీ.. ఇప్పటికే ప్లే ఆఫ్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్‌ పోరాడుతున్నా.. ఫాఫ్ డుప్లెసిస్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, లాకీ ఫెర్గూసన్, యష్ దయాల్, మహమ్మద్ సిరాజ్ వైఫల్యాలు జట్టుకు విజయాలను దూరం చేశాయి. స్టార్ ఆటగాళ్ల ఫామ్ ఆర్‌సీబీకి ఈ సీజన్‌ కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. బ్యాటింగ్ సహా బౌలింగ్‌ విభాగం కూడా గాడితప్పడం అతిపెద్ద ప్రతికూలాంశం. ఐపీఎల్ 2024లో బెంగళూరుకు 8 మ్యాచ్‌ల్లో ఏడు పరాజయాలు ఎదురయ్యాయి.