Shreyas Iyer Sister: నన్ను ద్వేషించండి, అమాయకులను వేధించడం మాత్రం ఆపండి.. శ్రేయస్ అయ్యర్ సోదరి రిక్వెస్ట్!

  • ప్లేఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమణ
  • శ్రేష్ఠ అయ్యర్ సోషల్ మీడియాలో వైరల్
  • 'దిత్తా ఏక్ పాయింట్ వీడియో నెట్టింట ట్రెండ్
Shreyas Iyer Sister

Shreyas Iyer Sister

Shreyas Iyer Sister Shresta Reacts To Trolls: ఐపీఎల్ 2026 సీజన్‌ను పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుతంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. వరుసగా ఆరు విజయాలతో టోర్నీలో సంచలనం సృష్టించిన పీబీకేఎస్.. తర్వాత ఒక్కసారిగా తడబడింది. వరుసగా ఆరు పరాజయాలు ఎదుర్కొని.. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఒక దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్.. చివరకు టాప్-4లో కూడా చోటు దక్కించుకోలేకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది.

పంజాబ్ కింగ్స్ వరుస విజయాల సమయంలో శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దై ఒక్కో పాయింట్ వచ్చిన తర్వాత ఆమె చేసిన ‘దిత్తా ఏక్ పాయింట్’ వీడియో నెట్టింట ట్రెండ్ అయింది. ‘మేం పంజాబీలం. మా పంజాబీల మనసు చాలా పెద్దది. అందుకే మీకు ఒక పాయింట్ ఇచ్చాం’ అంటూ సరదాగా కేకేఆర్‌ను ట్రోల్ చేశారు. ఆ వీడియోను కొందరు అభిమానులు సరదాగా తీసుకున్నప్పటికీ.. మరికొందరు సీరియస్ అయ్యారు. దీంతో ఆ వీడియోను శ్రేష్ఠ డిలీట్ చేశారు.

ఐపీఎల్ 2026 సెకండాఫ్‌లో పంజాబ్ కింగ్స్ వరుస ఓటముతో ప్లేఆఫ్స్‌కు దూరమైంది. దాంతో శ్రేష్ఠ అయ్యర్ వీడియోను ఆధారంగా చేసుకుని కొందరు ట్రోలింగ్ ప్రారంభించారు. ఈ ట్రోలింగ్‌పై తాజాగా ఆమె ఘాటుగా స్పందించింది. రెండు భాగాలుగా వీడియో విడుదల చేసిన ఆమె.. తన వీడియో వెనుక ఎలాంటి చెడు ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ‘ఆ వీడియో కేవలం సరదా కోసం మాత్రమే చేశాను. ఎవరినీ ట్రోల్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నా అన్న క్రికెటర్ కావడంతో ప్రతి క్రికెటర్‌ను నేను గౌరవిస్తాను. కానీ మీరు ఆ వీడియోను సీరియస్‌గా తీసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ దూషణలు నేను పనిచేసే చోటు వరకు రావడం బాధాకరం. నా వర్క్‌ప్లేస్‌కు కొందరు ఫోన్లు చేస్తున్నారు. నా సహోద్యోగులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. నన్ను ద్వేషించాలనుకుంటే చేయండి కానీ.. నాతో సంబంధం ఉన్న అమాయకులను వేధించడం ఆపండి’ అంటూ శ్రేష్ఠ భావోద్వేగానికి గురయ్యారు.

తన అన్న శ్రేయస్ అయ్యర్‌పై ఎప్పుడూ గర్వంగా ఉంటానని కూడా శ్రేష్ఠ స్పష్టం చేశారు. ‘శ్రేయస్ గెలిచినా, ఓడినా నేను ఎప్పుడూ అతడిని అభినందిస్తూనే ఉంటాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చాలామంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక మరోవైపు ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ సమరం నేడు ప్రారంభం కానుంది. క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుంది.