Site icon NTV Telugu

Shreyas Iyer-PBKS Wis: మా విజయ రహస్యం అదే.. అసలు విషయం చెప్పేసిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్‌!

Shreyas Iyer Pbks Wis

Shreyas Iyer Pbks Wis

ఐపీఎల్‌ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ (పీబీకేఎస్) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్లో ఓటమి ఎరుగని జట్టు ఏదైనా ఉందంటే.. అది పీబీకేఎస్ టీమ్ మాత్రమే. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలవగా, ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆదివారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ వరుస విజయాలకు కారణం ఏంటో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ వెల్లడించాడు. తాను ప్రత్యేకంగా ఎలా ఆడాలనే సూచనలు ఆటగాళ్లకు ఇవ్వనని, వారు తమ శైలిలో ఆడితేనే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతానని తెలిపాడు. మ్యాచ్‌కు ముందు కోచ్ రికీ పాంటింగ్ ప్రోత్సహిస్తారని, తాను కొన్ని మాటలు చెప్పి జట్టును ఉత్తేజపరుస్తానని శ్రేయస్‌ చెప్పాడు.

మ్యాచ్ అనంతరం శ్రేయస్‌ అయ్యర్ మట్లాడుతూ… ‘చాలా సంతోషంగా ఉంది. ప్రియాంశ్‌ ఆర్య, కూపర్‌ కనోలీ బాగా ఆడారు. ఇద్దరి భాగస్వామ్యం అద్భుతం. కొన్ని షాట్లు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఫాస్ట్ బౌలర్లను బ్యాక్‌ఫుట్‌పై స్ట్రైట్‌గా ఆడటం, స్పిన్నర్లను కూడా అదే ధైర్యంతో ఎదుర్కోవడం అంటే మాటలు కాదు. ధైర్యం, నిలకడ రెండూ అవసరం. ఎందుకంటే మ్యాచ్ ఎప్పుడైనా చేతిలో నుంచి జారిపోవచ్చు. కానీ ఇద్దరు మిడిల్ ఓవర్లలో ఆ భాగస్వామ్యాన్ని నిర్మించిన తీరు అద్భుతం. ఇప్పుడే కూపర్, ప్రియాంశ్‌తో మాట్లాడుతున్నాను. ఈ ఐపీఎల్‌లో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడతారో అనే పోటీ పెట్టుకుందాం అనుకున్నాం. మేమంతా సిద్ధంగా ఉన్నాం. గెలిచిన వారికి నా బ్యాట్ బహుమతిగా ఇస్తాను. వాళ్లు బాగా ఆడినా, నేనూ బాగా ఆడితే నాకు సంతోషమే’ అని చెప్పాడు.

‘నా అభిప్రాయం ప్రకారం ఆటగాళ్లను స్వేచ్ఛగా వదిలేస్తేనే ప్రతిభను బయటపెడతారు. అదే మా జట్టు మంత్రంగా మారింది. ప్రతి ఒక్కరికి తమ తమ విధానాలు, అలవాట్లు ఉంటాయి. వాటితోన ప్లేయర్స్ ఫలితాలు సాధిస్తున్నారు. కాబట్టి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము మాట్లాడుకుంటాం, మ్యాచ్‌కు ముందు రికీ మోటివేట్ చేస్తాడు. నేనూ కొద్దిగా మాట్లాడుతా. తర్వాత ఆటగాళ్లు మైదానంలో ఫలితం చూపిస్తారు. మా జట్టులో ఉన్న బౌలర్లలో చాలా మంది అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు. వాళ్లు తమ దేశాల తరఫున అద్భుతంగా రాణించారు. అనుభవం కూడా చాలా ఉంది. కాబట్టి వారికి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. ప్రత్యేకంగా కొనరు బ్యాటర్లకు వ్యూహాలు రూపొందిస్తాం. తర్వాత అమలు చేయడమే ముఖ్యం. ఈరోజు వారు బౌలింగ్ చేసిన తీరు, ఈ సీజన్ మొత్తం చూపుతున్న ప్రదర్శన నిజంగా అద్భుతం. ఇలానే కొనసాగాలి. ఇప్పటివరకు అన్నీ బాగా జరుగుతున్నాయి’ అని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version