Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్‌తో ప్రపంచ క్రికెట్‌కు వణుకే!

  • ఐపీఎల్ 2026లో విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్
  • సూర్యవంశీపై జస్టిన్ లాంగర్ ప్రశంసలు
  • వైభవ్‌తో ప్రపంచ క్రికెట్‌కు వణుకే
Justin Langer, Vaibhav

Justin Langer, Vaibhav

Justin Langer Praises Vaibhav Sooryavanshi Batting: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం జస్టిన్ లాంగర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంగళవారం జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నోపై వైభవ్ 36 బంతుల్లో 93 పరుగులు చేసి రాజస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన లాంగర్.. ఈ 15 ఏళ్ల కుర్రాడు భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌కు భయంకరంగా మారతాడని అన్నాడు. వైభవ్ ఇంకా పూర్తిస్థాయి బ్యాటింగ్ నేర్చుకోలేదని.. ఇప్పుడే ఇలా ఆడితే, పూర్తిగా నేర్చుకుంటే అతడి ఆటను ఊహించలేమని లాంగర్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన జస్టిన్ లాంగర్.. లక్నో ఓటమికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీనే అని స్పష్టం చేశాడు. ‘93 పరుగులు చేసిన వైభవ్ మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. మూడు ఓవర్లలో 70కి పైగా పరుగులు రావడానికి అతడే ప్రధాన కారణం. మా యువ బౌలర్లు ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకుంటారు. ఈ ఆట ఎంత కఠినమో వారికి అర్థమవుతుంది. వైభవ్ బ్యాటింగ్‌ను చూసి ప్రపంచ స్థాయి బౌలర్లు కూడా షాక్ అవుతున్నారు. మిచెల్ స్టార్క్ లాంటి దిగ్గజం బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడి ముఖంలో ఇక్కడ ఏమి జరుగుతోంది? అన్న భావన కనిపించింది. అన్రిచ్ నోర్జే పరిస్థితి కూడా అంతే. బుమ్రా, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, కమిన్స్ లాంటి టాప్ బౌలర్లను కూడా ఆటాడుకున్నాడు. బ్యాటింగ్ ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ ఈ కుర్రాడు వారి బౌలింగ్‌లో సిక్సర్లు ఈజీగా కొట్టడం చూసి నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది’ అని లాంగర్ చెప్పాడు.

‘వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా. చాలా మంది ఆటగాళ్లు ఇలా ఆడితే.. వారికి అది హై రిస్క్ అవుతుంది. కానీ వైభవ్ ప్రతి ఫార్మాట్‌లోనూ అదే దూకుడుతో పరుగులు చేస్తున్నాడు.నిజంగా ఇది అద్భుతం అనే చెప్పాలి. వైభవ్ ఇంకా పూర్తిస్థాయి బ్యాటింగ్ నేర్చుకోలేదు. రన్స్ చేయడం నేర్చుకునే ఉత్తమ మార్గం ఏంటంటే.. నిరంతరం పరుగులు చేయడమే. వైభవ్ అదే చేస్తున్నాడు. ఇప్పుడే స్టార్క్, నోర్జే, బుమ్రా, కమిన్స్, హేజిల్‌వుడ్ వంటి బౌలర్లను ఇబ్బంది పెడుతున్నాడు. మరి భవిష్యత్తులో అతడు బ్యాటింగ్‌ను పూర్తిగా నేచుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. అతడు చాలా చిన్న వయసులోనే ఈ స్థాయిలో ఆడుతున్నాడు. ఇది ప్రపంచ క్రికెట్‌కు భయంకరమైన సంకేతం’ అని అన్నాడు.

విదేశీ పరిస్థితుల్లో కూడా వైభవ్ రాణించగలడా అన్న ప్రశ్నకు లాంగర్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇండియా అండర్-19 జట్టుతో వచ్చినప్పుడు కూడా వైభవ్ ఆకట్టుకున్నాడని గుర్తుచేశాడు. ఈ సందర్భంగా డాన్ బ్రాడ్‌మన్‌ను ఉదాహరణగా ప్రస్తావించాడు. ‘ప్రతి గొప్ప ఆటగాడు పరిస్థితులకు తగ్గట్టు మారిపోతాడు. బ్రాడ్‌మన్ కూడా అలానే చేసేవాడు. వైభవ్ కూడా అలాంటి టాలెంట్ ఉన్న ఆటగాడు. ఎక్కడ ఆడినా తన ఆటను మార్చుకుని పరుగులు చేస్తాడు. నిజం చెప్పాలంటే అతడికి బౌలర్లు ఎక్కడ బంతి వేయాలో కూడా అర్థం కావడం లేదు. అందుకే అతడు ఇంకా మెరుగవుతూనే ఉంటాడు. అది ప్రపంచ క్రికెట్‌కు హానికరం’ అని జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు.